- Home
- National
- Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Indigo Flights Crisis: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై కేంద్రం సీరియస్ అయింది. విమానాల్లో 10% కోత విధించడంతో పాటు, పరిస్థితిని సమీక్షించేందుకు 8 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఇండిగోకు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న విమాన సర్వీసుల రద్దు, జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగాయి.
ఇండిగో విమాన సర్వీసుల్లో 10 శాతం కోత విధించడంతో పాటు, సంస్థ కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. అలాగే, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇండిగో పై కేంద్రం నిఘా.. 8 మందితో ప్రత్యేక బృందం
ఇండిగో నెట్‌వర్క్‌లో నెలకొన్న అవకతవకలను సరిదిద్దేందుకు డీజీసీఏ (DGCA) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఎనిమిది మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రిపోర్టుల ప్రకారం, ఈ బృందంలోని ఇద్దరు అధికారులు నేరుగా ఇండిగో కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ, రోజువారీ ప్రక్రియలను పరిశీలిస్తారు.
విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్న లోపాలను గుర్తించి, వాటిని సవరించడమే వీరి ప్రధాన విధి. వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో నియంత్రణ సంస్థ ఈ చర్యలు చేపట్టింది.
ఇండిగో 10 శాతం విమాన సర్వీసుల్లో కోత
కొత్త 'ఫ్లైట్ డ్యూటీ లిమిటేషన్' నిబంధనల కారణంగా పైలట్ల కొరత ఏర్పడటంతో ఇండిగో సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మంగళవారం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో నడపగలిగే విమానాల సంఖ్యను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది. అంతకుముందు డిజిసిఎ 5 శాతం కోత విధించగా, పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంత్రిత్వ శాఖ ఈ పరిమితిని 10 శాతానికి పెంచింది.
శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా ఈ కోతను విధించడం ద్వారా కార్యకలాపాలను స్థిరీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత 9 రోజుల్లోనే 4,000కు పైగా విమానాలు రద్దయ్యాయని, దీనివల్ల రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల రక్షణలో ప్రభుత్వం విఫలమైందంటూ ఢిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
దేశవ్యాప్తంగా ఇండిగో సేవలు స్థిరపడుతున్నప్పటికీ, మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు. ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారుల బృందం కృషి చేస్తోందని, ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రయాణికులు తమకు ఎదురయ్యే ఇబ్బందులపై సహాయం కోసం ఈ కింది మార్గాల ద్వారా సంప్రదించవచ్చు:
• 'ఎక్స్' (ట్విట్టర్) లో @MoCA_GoI ని ట్యాగ్ చేయవచ్చు.
• మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు: 011-24604283 / 011-24632987 కు కాల్ చేయవచ్చు.
• AirSewa యాప్ లేదా వెబ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
Even as Indigo operations across the country have stabilised, we continue to closely oversee the operations through the Ministry’s Control Room.
A regular vigil is being maintained for real-time resolution of passenger grievances and the Control Room team is making all efforts… pic.twitter.com/EGC5O78ROH— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 10, 2025
ఎయిర్‌పోర్టుల్లో 'రౌండ్ ది క్లాక్' పర్యవేక్షణ
ఇండిగో వైఫల్యం కారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విమానాశ్రయ కార్యకలాపాలపై 24 గంటల పర్యవేక్షణను ప్రారంభించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి సీనియర్ అధికారులను కీలక విమానాశ్రయాలకు పంపినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
డిసెంబర్ 3 నుంచి ఇండిగో సేవల్లో అంతరాయం మొదలైనప్పటి నుండి మంత్రిత్వ శాఖ, డీజీసీఏ రియల్ టైమ్ పర్యవేక్షణ చేస్తున్నాయని ఆయన ఎక్స్ లో వెల్లడించారు. ఈ పరిస్థితులను అసాధారణ పరిస్థితులుగా వర్ణించిన మంత్రి, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తిరిగి కోలుకుంటున్నామన్న ఇండిగో సీఈఓ
మరోవైపు, దేశవ్యాప్తంగా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన తీవ్రమైన అంతరాయాల తర్వాత తమ కార్యకలాపాలు ఇప్పుడు నిలకడగా ఉన్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 9 నాటికి తమ సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు.
"ఇండిగో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది" అని పేర్కొన్న ఎల్బర్స్, పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం తమ నెట్‌వర్క్‌లోని 138 గమ్యస్థానాలకు రోజుకు 1,800 కంటే ఎక్కువ విమానాలను నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యకు దారితీసిన కారణాలను అంతర్గతంగా సమీక్షిస్తున్నామని, వనరుల ప్రణాళికపై దృష్టి సారిస్తున్నామని సీఈఓ స్పష్టం చేశారు. డీజీసీఏ కూడా ఇండిగో సీఈఓను పిలిపించి వివరణ కోరినట్లు సమాచారం.

