తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని చెప్పడమే కాకుండా.. అందరిలోనూ ఐక్యత లోపించిందని మందలించారు.
తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ నిర్వహించిన టిఫిన్ మీటింగ్‌లో కీలక అంశాలు పేర్కొన్నారు. కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు, ఎంపీల వ్యవహారంపై ప్రధాని మోదీ చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, సమన్వయం లేకపోవడం, కలిసి పనిచేయకపోవడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయామని, అందుకు తాను ఎంతో బాధపడ్డానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని ఆయన గట్టిగా సూచించారు. తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోవడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వెనుకబడటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. విభేదాలను వీడి ఉమ్మడిగా పనిచేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు.
అసద్ టీం యాక్టివ్.. మరి మీరు.?
సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీల ఇన్ యాక్టివ్‌పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీల కన్నా అసదుద్దీన్ ఓవైసీ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ చురుగ్గా ఉన్నారని పేర్కొన్నారు. వివిధ జాతీయ, రాష్ట్ర అంశాలపై స్పందించడంలో ఎంపీలకు వేగం, చురుకుదనం లేవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఒక్కొక్క ఎంపీ సామాజిక మాధ్యమాల్లో ఏ మేరకు స్పందించారు, వారి యాక్టివ్‌నెస్ ఎలా ఉందనే విషయంపై సీల్డ్ కవర్‌లు ఆయా ఎంపీలకు ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలతో నిరంతరం మమేకమయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకా సమయం ఉన్నందున ఈ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఆయన నొక్కి చెప్పారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడానికి ఖేలో సంసద్ కార్యక్రమాలను, పోటీలను నిర్వహించాలని కూడా ప్రధాని మోదీ సూచించారు.
ఏపీ ఎంపీలతో ఇలా..
యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపైనా, చంద్రబాబుతో పార్టీ ఎలా వ్యవహరించాలనే విషయంపైనా ఏపీ ఎంపీలకు ప్రధాని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తానికి తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే అందరూ కలిసి పనిచేయాలని, వచ్చే అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దని, సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండాలని ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.


