- Home
- Telangana
- Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.

5.75 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు.. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సక్సెస్
హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా ముగిసింది. ఈ రెండురోజుల సదస్సుకు దేశ, విదేశాల నుండి ప్రముఖ సంస్థలు, పెట్టుబడిదారులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలకమైన రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
రంగాలవారీగా కీలక ఒప్పందాలు.. ఇండస్ట్రీలకు భారీ ఊతం
సదస్సులో అనేక రంగాలలో భారీ పెట్టుబడులు ప్రకటించారు. వాటిలో
- ఇన్‌ఫ్రాకీ పార్క్స్ - రూ.70,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా పార్క్ ఏర్పాటు.
- జెసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ - రూ.9,000 కోట్ల పెట్టుబడులు
- పర్యాటక రంగం - రూ.7,045 కోట్ల పెట్టుబడులు
- ఏజీపీ గ్రూప్ - మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడి, 1 గిగావాట్ డేటా సెంటర్ నిర్మాణం.
- ఫుడ్ లింక్ హోల్డింగ్స్ - రూ.3,000 కోట్ల పెట్టుబడులు
- బయోలాజికల్ - ఈ పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడి.
- ఫెర్టిస్ ఇండియా - వ్యవసాయ, ఆహార రంగానికి రూ.2,000 కోట్ల రీసెర్చ్ సెంటర్.
- రూ.1,100 కోట్లతో ఫ్లగ్ - ఇన్ హైబ్రిడ్ మోటార్‌బైక్స్ తయారీ యూనిట్
- డ్రీమ్‌వాలీ గోల్ఫ్ & రిసార్ట్స్ - రూ.1,000 కోట్లతో రిసార్ట్ నిర్మాణం.
ఈ ఒప్పందాలు పరిశ్రమల విస్తరణకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వేలాది ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నాయి.
విజన్ 2047 ఆవిష్కరణ.. తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశ
సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా "తెలంగాణ రైజింగ్ 2047" విజన్ డాక్యుమెంట్ విడుదలయ్యింది. ఇది రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశను నిర్దేశించే సమగ్ర ప్రణాళికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ, ఆనంద్ మహీంద్రా, దువ్వూరి సుబ్బారావు, కార్తీక్ మురళీధరన్, అర్వింద్ సుబ్రమణియన్‌తో పాటు సినీ ప్రముఖుడు చిరంజీవి పాల్గొన్నారు. అదేవిధంగా శాంతను నారాయణ్, టోనీ బ్లెయిర్, రఘురాం రాజన్, ప్రేమ్ వాట్సా వర్చువల్‌గా ప్రసంగించారు.
ప్రజల భాగస్వామ్యంతో రూపొందిన దార్శనిక విజన్
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో విజన్ డాక్యుమెంట్ ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిందని వెల్లడించారు. దీనిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిపుణులు, నీతి ఆయోగ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు 4 లక్షల మంది ప్రజలు ఆన్‌లైన్‌లో చేసిన సూచనలతో ఈ డాక్యుమెంట్ రూపు దిద్దుకుందని తెలిపారు. తెలంగాణ చరిత్రలో చోటుచేసుకున్న ఉద్యమాలు, సామాజిక అసమానతల నివారణ, పేదల అభ్యున్నతి.. ఇవన్నీ ఈ విజన్ డాక్యుమెంట్ కేంద్రబిందువులుగా నిలిచాయి.
విద్య, నైపుణ్యం, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ రంగాలు పునాది అని పేర్కొన్నారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు.. ఇవన్నీ విజన్ 2047లో కీలక భాగాలుగా వెల్లడించారు.
2047 నాటికి భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించాలన్న లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులతో ముగిసిన ఈ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. విజన్ 2047 విడుదలతో రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధమైంది.

