- Home
- Entertainment
- Movie Reviews
- Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Sardar 2 Movie Review: సర్దార్ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Sardar 2 Movie Review: పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తి, ఎస్.జె. సూర్య నటించిన 'సర్దార్ 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం రిలీజైంది. ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

సర్దార్ 2 రివ్యూ
2022లో వచ్చిన 'సర్దార్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు 'సర్దార్ 2' వచ్చింది. పి.ఎస్. మిత్రన్ డైరెక్షన్‌లో కార్తి డ్యూయల్ రోల్‌లో నటించగా, ఎస్.జె. సూర్య విలన్‌గా కనిపించారు. భారీ అంచనాల మధ్య గురువారం(సెప్టెంబర్ 10)న రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సర్దార్ 2 కథ
'వాల్రస్' అనే ఓ సీక్రెట్ ఏజెంట్ కోసం మన గూఢచార సంస్థ వెతుకుతుండటంతో సినిమా స్టార్ట్ అవుతుంది. కార్తి అతన్ని వెతుక్కుంటూ వెళ్తే, ఎస్.జె. సూర్య మనుషులు కూడా అతన్ని ఫాలో అవుతారు. చివరికి వాల్రస్ చనిపోతూ, కత్తి ఆకారంలో ఉన్న ఒక తాళాన్ని కార్తికి అప్పగిస్తాడు. ఆ తాళం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి కార్తి రంగంలోకి దిగుతాడు. అప్పుడే అలాంటివి మరో రెండు తాళాలు ఉన్నాయని, ఆ మూడు కలిస్తే ఒక పెద్ద 'బయో-అపోకలిప్స్'కు దారితీసే ప్రమాదకరమైన దాన్ని తెరవొచ్చని తెలుస్తుంది. మానవజాతిలో చాలామందిని నాశనం చేయడమే ఎస్.జె. సూర్య ప్లాన్. కానీ ఈ కథ ఇవాళ మొదలైంది కాదు, దీని మూలాలు 1981లోనే ఉన్నాయని కార్తి కనిపెడతాడు. 1981లో జరిగిన ఓ పెద్ద బయోలాజికల్ విపత్తును ఆపి దేశాన్ని కాపాడింది సర్దార్ అని కొడుకు విజయ్ ప్రకాష్‌కి తెలుస్తుంది. కానీ ఆ ఘటనలో ఓ గ్రామం మొత్తం తీవ్రంగా నష్టపోతుంది. సుమారు 3,000 మంది ఉన్న ఆ గ్రామంలో, సర్దార్ కేవలం 54 మందిని మాత్రమే యాంటీడోట్ సహాయంతో కాపాడగలుగుతాడు. అందరినీ కాపాడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాననే అపరాధభావం సర్దార్‌ను ఏళ్ల తరబడి వెంటాడుతుంది. మరి, ఎప్పుడో ఆపిన ఆ విపత్తును మళ్లీ ఎస్.జె. సూర్య ఎందుకు సృష్టించాలనుకుంటున్నాడు? అతని లక్ష్యం ఏంటి? సర్దార్ మళ్లీ ఆ ప్రమాదాన్ని ఆపాడా? అన్నదే మిగతా కథ.
సర్దార్ 2 మూవీ ఎలా ఉందంటే
మొదటి భాగంలో నీటి సమస్యపై డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ సమాజానికి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశారు. ఈ రెండో భాగంలో 'కొలిస్టిన్' అనే యాంటీబయాటిక్‌ను తప్పుగా వాడితే భవిష్యత్తులో ఎలాంటి పెను విపత్తు వస్తుందో చూపించారు. దీన్ని కేవలం సీరియస్‌గా చెప్పకుండా, ఎస్.జె. సూర్య, యోగి బాబు, నిళల్‌గళ్ రవి పాత్రల ద్వారా కామెడీతో, ఆసక్తికరంగా నడిపించడం సినిమాకు పెద్ద ప్లస్. నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఈ సీన్స్ ఉంటాయి. దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మనం తీసుకునే ఆహారం, అందులో కలిసే మందులు, యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోలాస్టిన్ (Colastin) అంశం ద్వారా చూపించారు. పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు.
సర్దార్ 2 మూవీలో మైనస్‌లు
స్పై థ్రిల్లర్‌కు కమర్షియల్ అంశాలను జోడించడంతో సినిమా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే కామెడీ కూడా కథ ఫ్లోను దెబ్బతీసింది. జపాన్ నుంచి కోలాస్టిన్ దొంగిలించే ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో థ్రిల్ ఇవ్వవు. విలన్ ఫ్లాష్‌బ్యాక్ తర్వాత సినిమా సాధారణ రివెంజ్ డ్రామాగా మారుతుంది. మూడు గంటల నిడివి కూడా మైనస్‌గా మారింది. దానికి తోడు కామెడీ, ఎమోషనల్ ట్రాక్‌లను కూడా రొటీన్‌గా రాసుకోవడంతో సినిమా మరింత సాగతీతగా మారింది. తెలుగు డబ్బింగ్ కూడా దారుణంగా ఉంది. ఏమాత్రం సహజంగా అనిపించలేదు. అది పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు.
సర్దార్ మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
కార్తి... సర్దార్, విజయ్ ప్రకాష్ అనే రెండు పాత్రల్లో తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా సర్దార్ ఫ్లాష్‌బ్యాక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ఎంట్రీ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఎస్.జె. సూర్య విలన్‌గా మరోసారి తన యూనిక్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఆయన కనిపించే ప్రతి సీన్‌లో విలనిజం బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా యోగి బాబు, నిళల్‌గళ్ రవితో ఆయన కాంబినేషన్ సీన్స్‌కు థియేటర్లో విజిల్స్ పడతాయి. మాళవిక మోహనన్ ఏజెంట్ పాత్రను బాగా హ్యాండిల్ చేసింది. నాజర్, అవినాష్, ఆషికా రంగనాథ్, బాబు ఆంటోనీ, యోగి బాబు వంటి మిగతా నటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నీకల్‌గా సర్దార్ 2 ఎలా ఉందంటే?
సినిమాలో యాక్షన్ సీన్స్ పెద్ద బలం. సినిమాటోగ్రఫీ, VFX లాంటి టెక్నికల్ అంశాలు సినిమాకు గ్రాండియర్ లుక్ ఇచ్చాయి. సామ్ సి.ఎస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకమైన సీన్లకు బలాన్నిచ్చింది. ముఖ్యంగా యాక్షన్, మాస్ సీన్స్‌లో బీజీఎం బాగా వర్కవుట్ అయింది. కార్తి-ఎస్.జె. సూర్య నటన, బలమైన క్యారెక్టర్ డిజైన్, 'కొలిస్టిన్' పై సోషల్ మెసేజ్, యాక్షన్ సీన్స్, టెక్నికల్ వర్క్, సపోర్టింగ్ యాక్టర్స్ నటన సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే ఎమోషనల్‌గా మూవీ కనెక్ట్ కాలేదు. టెక్నీకల్‌గా బాగున్నా, దర్శకుడు సినిమాని రక్తికట్టేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. లాజిక్ లెస్‌గా, ఆకట్టుకునేలా రూపొందించడంలో తడబాటు కనిపిస్తుంది. దీంతో అది సినిమా ఫలితంపై దెబ్బ పడిందని చెప్పొచ్చు.
ఫైనల్‌గా
మొత్తంగా సందేశం బాగున్నా.. ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ‘సర్దార్ 2’ నిరాశపరుస్తుంది. మంచి పాయింట్‌ను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు.
రేటింగ్: 2

