Palm Oil: చిప్స్ నుంచి బిస్కెట్ల తయారీ దాకా పామాయిల్ ఎందుకు వాడతారు? అసలు పామాయిల్ అంటే?
చిప్స్, బిస్కెట్లు, కేక్స్.. వంటివి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. కానీ బయట అమ్మే చాలా ఆహారాలను పామాయిల్ తోనే వండుతారు. అసలు పామాయిల్ ఆహారాల్లో వాడవచ్చా? ఫుడ్ కంపెనీలు దీన్నే ఎందుకు ఎక్కువగా వాడుతున్నాయి?

అసలు పామాయిల్ అంటే ఏంటి?
చిప్స్, బిస్కెట్లు, కేక్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లపై చూడండి… 'Palm Oil' లేదా 'Palmolein' అని రాసి ఉంటుంది. అంటే వాటిని ఆ నూనెలో వేయించారు లేదా ఆ నూనెను వాడారు అని అర్థం. పామాయిల్ అనేది ఆయిల్ పామ్ చెట్టు పండు నుంచి తీసే ఒక రకమైన వంట నూనె. దీన్ని ఫుడ్ తయారీలో వాడేటప్పుడు రకరకాలుగా శుద్ధి చేస్తారు. అవసరాన్ని బట్టి పామాయిల్, పామ్ ఒలీన్ రూపాల్లో వాడతారు. ఇతర నూనెలతో పోలిస్తే, అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది స్థిరంగా ఉంటుంది. అందుకే ఫుడ్స్ కంపెనీలు దీనితోనే ఎక్కువ ఆహార పదార్థాలు తయారు చేస్తారు. 2023లో భారతీయ వంటకాలపై జరిపిన ఒక అధ్యయనంలో, డీప్ ఫ్రై చేసేటప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్ కన్నా పామ్ ఒలీన్ ఆక్సిడేషన్‌ను తట్టుకోవడంలో మెరుగ్గా పనిచేసిందని తేలింది.1
పామాయిల్ ఎందుకు వాడతారు?
పామాయిల్ లో వేయించిన చిప్స్, నమ్కీన్స్ వంటివి రుచిగా ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు పామాయిల్ వాడకం వెనుక రుచి మాత్రమే కాదు, టెక్నాలజీ, ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి.
పామాయిల్ ను అధిక వేడిలో వేయించడానికి ఉత్తమంగా ఉంటుంది. ఫ్యాక్టరీలలో చిప్స్, మిక్చర్ వంటివి భారీగా తయారుచేసేటప్పుడు నూనెను ఎక్కువసేపు అధిక వేడికి గురిచేస్తారు. పామ్ ఒలీన్ వంటి నూనెలు ఇలాంటి అధిక ఉష్ణోగ్రతలో కూడా స్థిరంగా ఉంటాయి. కాబట్టి త్వరగా పాడవ్వవు.
చిప్స్ లేదా నమ్ కీన్ తిన్నప్పుడు వచ్చే కరకరలాడే గుణం కేవలం పిండి వల్ల రాదు. వాడే నూనె వల్ల కూడా వస్తుంది. పామాయిల్, దాని ఫ్రాక్షన్లు ఆహారానికి సరైన టెక్చర్ ఇచ్చి, ఎక్కువసేపు క్రిస్పీగా ఉండటానికి సహాయపడతాయి.
కొన్ని నూనెలకు ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటాయి. కానీ రిఫైన్డ్ పామాయిల్ రుచి సాధారణంగా న్యూట్రల్‌గా ఉంటుంది. కాబట్టి, ఇది బిస్కెట్ లేదా చిప్స్ అసలు రుచిని మార్చదు.
పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదా?
పామాయిల్ ఆరోగ్యానికి మంచిది కాదనే వాదన వినిపిస్తుంది. అది నిజమని ఎక్కడ నిరూపణ కాలేదు. అలా అని పామాయిల్ ఎంతైనా తినొచ్చు అనుకోవడం కూడా తప్పే. పామాయిల్‌లో శాచురేటెడ్ ఫ్యాట్ (saturated fat) అధికంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, మనం రోజూ తీసుకునే మొత్తం శక్తిలో శాచురేటెడ్ ఫ్యాట్ వాటా 10% కంటే తక్కువగా ఉండాలి. శాచురేటెడ్ ఫ్యాట్‌కు బదులుగా పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ (polyunsaturated fat) వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోవాలని WHO సిఫార్సు చేస్తోంది. పామాయిల్, కొబ్బరి నూనె, వెన్న, నెయ్యి వంటివి శాచురేటెడ్ ఫ్యాట్‌కు ఉదాహరణలని WHO తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. అంటే, పామాయిల్ ఉన్న ఆహారం ఒక్కసారి తింటేనే ఆరోగ్యం పాడైపోదు. కానీ, రోజూ తినే ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ కాకుండా చూసుకోవడం ముఖ్యం.

