- Home
- Entertainment
- 2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Hanuman Ansh: కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడు?

సైలెంట్ గా వచ్చి చరిత్ర సృష్టించిన సినిమా..
నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' సినిమా గురించి రిలీజ్‌కు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, విడుదలయ్యాక ఈ సినిమా ఒక కొత్త చరిత్ర సృష్టించింది. చిత్ర బృందం పెద్దగా ప్రమోషన్లు, యాడ్స్ చేయలేదు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులే దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. థియేటర్లను దేవాలయాలుగా భావించి, చెప్పులు బయట విడిచి మరీ సినిమా చూసి భక్తిలో మునిగిపోయారు. ఫలితంగా, ఈ సినిమా కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతూ పోయాయి. కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 236 కోట్ల రూపాయలు వసూలు చేసి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, ఓటీటీ నుంచి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఓటీటీ నుంచి 100 కోట్ల ఆఫర్ నిజమేనా?
'హనుమాన్ అంశ్' సినిమాకు ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ఆడుతున్న థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. టికెట్ల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. మొదట్లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా పట్టించుకోని ఈ సినిమాకు ఇప్పుడు అన్ని వైపుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 'హనుమాన్ అంశ్' సినిమా హక్కుల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిందని సమాచారం. ఇప్పుడు ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
హిందీ సినిమాలకు థియేటర్లలో కనీసం 8 వారాల గడువు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఆ తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ గడువు ముగియడం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, ఈ గడువు కంటే ముందే 100 కోట్ల రూపాయలతో డీల్ కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు టాక్. కానీ, చిత్ర బృందం ఈ 100 కోట్ల డీల్‌కు అంగీకరించిందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఈ ఆఫర్ వార్త మాత్రం బలంగా వినిపిస్తోంది.
ఆనందంలో మూవీ టీమ్..
ఓటీటీ డీల్‌పై సహ నిర్మాత రాగిణి సన్ స్పందిస్తూ, "ప్రస్తుతం ఓటీటీ గురించి ప్రేక్షకులు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సినిమా థియేటర్లలో అద్భుతంగా ఆడుతోంది. ఎక్కువ మంది ఈ సినిమాను థియేటర్లలో చూడాలన్నదే మా కోరిక. 'హనుమాన్ అంశ్' సినిమాకు ఆంజనేయుడి ఆశీస్సులు ఉన్నాయి. ప్రజలు ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడుతున్నారు. మాకు అదే ముఖ్యం. సినిమా చూసిన ప్రేక్షకులే మౌత్ పబ్లిసిటీ చేసి దీన్ని ఇంత పెద్ద హిట్ చేశారు," అని రాగిణి అన్నారు.
రికార్డు సృష్టించిన సినిమా..
కేవలం 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు విడుదలైనప్పుడు పెద్దగా స్పందన రాలేదు. మొదటి రోజు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మొదటి రెండు వారాల్లో సినిమా 1.48 కోట్ల రూపాయలు సంపాదించింది. అంటే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. కానీ, ఆ తర్వాత సినిమా గురించి జనాల్లో టాక్ మొదలైంది. బాబా నీమ్ కరోలీపై తీసిన మంచి సినిమా అని ఒకరి నుంచి ఒకరికి పాకింది. జనాలే ప్రచారం చేయడంతో 16వ రోజు నుంచి కలెక్షన్ల సునామీ మొదలైంది. నాలుగో వారంలో 61 కోట్లు, ఐదో వారానికి 90 కోట్లకు కలెక్షన్లు పెరిగాయి. ఇప్పుడు దేశవిదేశాల్లో కలిపి మొత్తం 236 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది.