ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. మెగాస్టార్ కలల ప్రాజెక్ట్ ఇది. రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం సైరా చిత్ర యూనిట్ ఇండియాలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ సినిమాకు ప్రచారం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా సైరా చిత్రానికి మంచి బజ్ నెలకొని ఉంది. 

తాజాగా సైరా చిత్ర యూనిట్ జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 4 పాటలు ఉన్నాయి. 'ఓ సైరా' అనే సాంగ్ ఇదివరకే రిలీజ్ చేశారు. నాలుగు పాటలు ఉన్నప్పటికీ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉంచామని దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ' ఓ సైరా'తో పాటు 'జాగో నరసింహా జాగోరే' అనే జాతర సాంగ్ సినిమాలో ఉండనుంది. ఈ రెండు పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. 

అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన 'అందం అంకితం' అనే పాట.. చంద్రబోస్ సాహిత్యం అందించిన 'శ్వాసలోన దేశమే' అనే ఎమోషనల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్ లో ఉన్నాయి. ఓ సైరా సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. జాగోరే నరసింహా సాంగ్ హుషారెత్తించే విధంగా ఉంది. మిగిలిన రెండు పాటలు కూడా బావున్నాయి. సైరా చిత్రం 170 నిమిషాల నిడివితో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.