యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దెబ్బలు తగలటం, గాయాలు అవ్వటం కామన్. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఒక్కోసారి అవే పెరిగి పెద్దై సమస్యలు తెచ్చిపెడతాయి. ఆ రోజుకు అవి చాలా చిన్నగా అనిపించి,తగ్గిపోయినట్లు అనిపించినా ఆ తర్వాత నడుం నెప్పి అని, భుజాల నెప్పి అని మిగిలిపోయి ఇబ్బంది పెడుతూంటాయి. అలాంటి సమస్యే శర్వానంద్ ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు. ఆయన కొద్ది కాలం క్రితం ఓ డేంజరస్ స్టంట్ ని ఓ చిత్రం కోసం చేసారు. అయితే ఆ సమయంలో జరిగిన ప్రమాదంనుంచి లక్కీగా బయిటపడ్డారు. అయితే భుజానికి తగిలిన దెబ్బకు సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్దితి వచ్చిందని సమాచారం.
  
అయితే ఇక్కడ దరుదృష్టకరమైన విషయం ఏమిటంటే..గతంలో శర్వానంద్ కు అదే ప్లేస్ లో దెబ్బ తగిలి సర్జరీ జరిగిందిట. ఇప్పుడూ అక్కడే మళ్లీ తగలటంతో పెయిన్ బాగా వస్తోందిట. డాక్టర్లు మందులు మీద ఆధారపడటం కన్నా చిన్నపాటి సర్జరీతో సమస్యను తొలిగించుకోవచ్చని చెప్పారట. దాంతో అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో అమెరికా నుంచి ఇండియాకు రానున్నారు.

ఇక సమంతతో చేసిన జాను మూవీ షూటింగ్ సమయంలోనే  శర్వా భుజానికి గాయమైంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఓ రెండు మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ యథావిథిగా జాను షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే జాను సినిమా విడుదలైంది. సినిమా ఆడకపోయినా శర్వా నటుకు మంచి ప్రశంసలు వచ్చాయి. జాను మూవీ షూటింగ్ ఆలస్యమవుతుందని అప్పట్లో సర్జరీ చేయించుకోలేదట. తాజాగా సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
 
ఇక ప్రస్తుతం శర్వానంద్.. 'శ్రీకారం'  చిత్రంలో నటిస్తున్నాడు. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.., 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీకారం' మూవీ.. తుది దశ షూటింగ్ మాత్రమే మిగిలుంది. డెబ్యూ డైరెక్టర్ కిశోర్ దర్శకత్వంలో  'శ్రీకారం' మూవీ తెరకెక్కుతోంది. అయితే, ఇప్పుడు వినిపిస్తోన్న టాక్ ఏంటంటే... 'శ్రీకారం' నిజానికి కిషోర్  యూట్యూబ్ కోసం తీసిన ఇండిపెండెంట్ మూవీ అట.  గంట నిడివిగల ఈ షార్ట్  ఫిల్మ్  ప్రీమియర్ షో కూడా నిర్వహించారు. కానీ, అనూహ్యంగా శర్వానంద్‌కి  ఆ షార్ట్ ఫిల్మ్‌లోని ఐడియాలజీ నచ్చి పూర్తి స్థాయి వెండితెర చిత్రంగా మలచాలని భావించాడట.