యాంకర్ అనసూయ భరద్వాజ్ తనపై జరిగే సోషల్ మీడియా దాడులు, ట్రోల్స్ గురించి మరోమారు అసహనం వ్యక్తం చేశారు. నటుడు మాధవన్ ట్వీట్ కి ఆమె స్పందనగా ఓ ట్వీట్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తుండగా, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా పరాజయాలు చవిచూసింది. ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న ఎం ఎస్ ధోనిని చెన్నై అభిమానులు టార్గెట్ చేశారు. ధోని సరిగా ఆడి, జట్టును గెలిపించాలని లేదంటే తన కూతురును రేప్ చేస్తాం అని దారుణమైన బెదిరింపులకు దిగారు. 

సోషల్ మీడియా ద్వారా నెటిజెన్ చేసిన ఈ కామెంట్ సంచలనంగా మారింది. పలువురు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. సదరు నెటిజెన్ పై కేసు కూడా ఫైల్ కావడంతో పాటు, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనికి స్పందిస్తూ మాధవన్ ఓ ట్వీట్ చేశారు. ధోని కూతురుపై దారుణమైన కామెంట్ చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు బాధ్యత నెరవేర్చారు. సోషల్ మీడియా ద్వారా ఏదైనా చేయోచ్చని భావిస్తున్న కొందరు దుర్మార్గులకు ఇది ఒక హెచ్చరిక అవుతుంది. అని ట్వీట్ చేశారు. 

ఆ ట్వీట్ ని ఉద్దేశిస్తూ అనసూయ ప్రతి రోజు నేను ఇలాంటి బెదిరింపులు, కామెంట్స్ ఎదుర్కొంటున్నాను. ఆన్లైన్ వేధింపులపై మరింత కఠినమైన నిబంధలు ఉండాలని కోరుకుంటున్నాను. వేధింపులను పట్టించుకోకపోవడం మన బలహీనతగా మారితే పరిస్థితి ఏమిటి? నివారణ చర్యలు బాధితులకు సహాయం చేయలేవా? అని అన్నారు. తరచుగా కొందరు ఆన్లైన్ వేధింపులకు తెగబడుతున్నా కఠినమైన చట్టాలు లేకపోవడం వలన ఏమి చేయలేకపోతున్నాం అని అనసూయ తన బాధను వెళ్లగక్కారు. అనేక మార్లు సోషల్ మీడియా వేధింపులపై అనసూయ ఫిర్యాదు చేయడం జరిగింది.