నటుడు నాజర్‌ గాయపడ్డారు. సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించింది యూనిట్‌.

విలక్షణ నటుడు నాజర్‌ గాయపడ్డారు. సినిమా షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించింది యూనిట్‌. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో జరుగుతున్న తమిళ సినిమా షూటింగ్‌లో నాజర్‌ గాయపడినట్టు తెలుస్తుంది. ఇందులో నాజర్‌తోపాటు సుహాసిని, మెహ్రీన్‌, షయాజీ షిండే పాల్గొన్నారు. 

అయితే నాజర్‌కి మైనర్‌గానే గాయాలయ్యాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మెట్లపై నుంచి దిగుతున్న సమయంలో నాజర్‌ జారి పడినట్టు తెలుస్తుంది. దీంతో స్వల్పంగా గాయాలయ్యాయట. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ సినిమాకి సంబంధించి షూటింగ్‌లో పాల్గొంటున్నారు, హీరో, దర్శకుడెవరు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

నాజర్‌ విలక్షణ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఎక్కువగా ఆయన తెలుగు సినిమాల్లో కనిపిస్తుంటారు. పాజిటివ్‌, నెగటివ్‌ పాత్ర ఏదైనా దాన్ని రక్తికట్టించడంలో ఆయన ముందుంటారు. 

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వందల చిత్రాలు చేశారు నాజర్‌. ఇటీవల ఆయన తెలుగులో `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`, `ఆచార్య`, `క్లాప్‌`, `టక్‌ జగదీష్‌` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.