యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్‌ని వణికించేసింది. నెపోటిజం, లైంగిక వేధింపులు, డ్రగ్స్ కేసు వంటివి బయటకు వచ్చాయి. ముఖ్యంగా డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ సినీ వర్గాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. స్టార్స్ పేర్లు బయటకు రావడంతో మిగిలిన వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

ఈ నేపథ్యంలో వీటిపై ఫైర్‌ బ్రాండ్‌ కంగనా బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మీడియా సంస్థలు మీడియాలోని లూప్స్ ని బయటపెడుతూ అనేక కథనాలు ప్రసారం చేశాయి. ఇలా ఓ రకంగా బాలీవుడ్‌ పరువు పోయింది. దీంతో తాజాగా నాలుగు హిందీ అసోసియేషన్లు, 34 ప్రొడక్షన్‌ హౌజెస్‌ కలిసి నష్టనివారణ చర్యలు ప్రారంభించాయి. 

పలు మీడియా సంస్థలు, అందులోని జర్నలిస్ట్ లపై ఢిల్లీ హైకోర్ట్ లో పిటిషన్‌ వేశాయి. ఈ వార్త ఇప్పుడు మరో సంచలనంగా మారింది. దీనిపై తాజాగా కంగనా స్పందించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ట్వీట్లతో విరుచుకుపడింది. బాలీవుడ్‌లో డ్రగ్స్, దోపిడీ, స్వార్థం, మతం వంటి మురికితో పేరుకుపోయిందని, దాన్ని శుభ్రం చేయకుండా వదిలేశారని, బాలీవుడ్‌ స్ట్రయిక్స్ బ్యాక్‌ అంటూ తన మీద కూడా కేసు పెట్టుకోండని, తాను ఉన్నంత కాలం బాలీవుడ్‌లోని ఇలాంటి పనులు చేసే వారిని బయటకు లాగుతూనే ఉంటానని స్పష్టం చేసింది. 

కంగనా ఇంకా చెబుతూ, స్టార్‌ హీరోలు మహిళల విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ వంటి వారిని పైకి రానివ్వరని, యాభై ఏళ్ళ వయసున్న వారు కూడా చిన్న పిల్లలతో ఆడుకోవాలని చూస్తున్నారని, వాళ్ళ కళ్లముందే అన్యాయం జరుగుతున్నా ఏమాత్రం స్పందించరని మండిపడింది. 

`ఇక్కడ రాయబడని చట్టం ఒకటి ఉంది. నా చెత్త రహస్యాలు నువ్వు బయటపెట్టకు.. నీ చెత్త రహస్యాలు నేను బయటపెట్టను.. అనే విధేయతను చాటుతుంటారు. నేను పుట్టినప్పటి నుంచి సినీ కుటుంబాలకు చెందిన వారే సినిమా పరిశ్రమను ఏలుతున్నారు. ఇది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది` అని తెలిపింది.