ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంటాయి. స్టైలిష్ యాక్షన్, ప్రేమ కథలు తెరకెక్కించ్చడంలో గౌతమ్ మీనన్ సిద్ధహస్తుడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ ధ్రువ నక్షత్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. 

గౌతమ్ మీనన్ తదుపరి చిత్రం కూడా ఖరారైపోయింది. తమిళ,  తెలుగు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న సూర్యతో గౌతమ్ మీనన్ ఓ చిత్రం చేయబోతున్నాడు. దాదాపు దశాబ్దం క్రితమే వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సింది. కానీ అప్పట్లో ఇద్దరికీ పరస్పర విభేదాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకుకు సాగలేదు. 

ప్రస్తుతం మనస్పర్థలు తొలగిపోవడంతో ఫ్రెష్ గా తమ కాంబినేషన్ ని ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం సూర్య సుధా కొంగర దర్శత్వంలో ఆకాశమే నీ హద్దురా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే దాదాపుగా ముగిసింది. త్వరలో రిలీజ్ కు సన్నాహకాలు చేస్తున్నారు. 

తాజాగా గౌతమ్ మీనన్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సూర్యకి జోడీగా ఈ చిత్రంలో అనుష్క కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనుష్క, సూర్య లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ జంటగా నటించిన సింగం సిరీస్ దూసుకుపోతోంది. సూర్య, అనుష్క కెమిస్ట్రీ మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయాలనీ గౌతమ్ మీనన్ భావిస్తున్నాడు. 

గౌతమ్ మీనన్ తో పాటు సింగం డైరెక్టర్ హరికి కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే ఇది సింగం సిరీస్ కాదు. మరో కొత్త కమర్షియల్ చిత్రానికి హరి ప్లాన్ చేస్తున్నారు.