Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాలకు అలీ గుడ్‌ బై.. కామన్‌ మ్యాన్‌గానే ఉండిపోతానని వెల్లడి.. పవన్‌ కళ్యాణే కారణమా?

ప్రముఖ హాస్యనటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశాడు. అంతేకాదు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్టు వెల్లడించారు. 
 

comedian ali says goodbye to politics Pawan Kalyan is the reason?
Author
First Published Jun 28, 2024, 10:41 PM IST

ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పారు. ఆయన ఏపీలో వైసీపీలో యాక్టివ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్‌ మీడియా వైసీపీ సలహాదారుగా ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన జగన్‌ ప్రభుత్వంలో సేవలందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని, ఓ కామన్‌ మ్యాన్‌గానే ఉంటానని వెల్లడించారు అలీ. 

ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అలీ ఓ వీడియోని విడుదల చేశారు. తన రాజకీయ ప్రస్తానం గురించి వెల్లడించారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తాను సినిమాల్లో రాణించానని, చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత ఓ వయసు వచ్చాక లెజెండరీ నిర్మాత డి రామానాయుడు ఇచ్చిన అవకాశాల వల్లే తాను మళ్లీ సినిమాల్లోకి రాగలిగాను అని, ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. 1999లో తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. తనకు ఇంతటి లైఫ్‌ ఇచ్చిన రామానాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా, తనని క్యాంపెయిన్‌ చేయాలని కోరగా, ఆ సమయంలో ఆయన కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపారు. 

`దాదాపు 20ఏళ్లపాటు అందులోనే(టీడీపీ) ఉన్నాను. ఆ తర్వాత ఇటీవల మళ్లీ ఇటు(వైసీపీ)లోకి రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు సినిమా ఇండస్ట్రీ, నా తెలుగు ప్రేక్షకులు, నిర్మాతలు, దర్శకులు, నా హీరోలు.  సినిమాల వల్ల తాను ఈ స్థాయికి వచ్చాను, 45ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను, 1200లకుపైగా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఆరు భాషల్లో యాక్ట్ చేశాను. భగవంతుడు నాకు దయా గుణం ఇచ్చాడు కాబట్టి, రాజకీయం తోడైతే పది మందికి సహాయపడగలను అనే ఉద్దేశ్యంతోటి రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే, రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. 

ఇండస్ట్రీ నాకు ఇంతమంచి లైఫ్‌ ఇచ్చింది. నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి, నలుగురుని చూసి మా నాన్నగారి పేరుతో ఓ ట్రస్ట్ పెట్టుకున్నాను. దాదాపు 16ఏళ్లుగా ఈ ట్రస్ట్ ని నడిపిస్తున్నా. పేదలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ వచ్చాను, కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. నా ఇన్‌కమ్‌లో 20శాతం ట్రస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఫారెన్‌ కంట్రీస్‌లో ఏదైనా ఈవెంట్‌ చేస్తే అందులోనుంచి 60శాతం ట్రస్ట్ కి వెళ్లి 40శాతం నేను తీసుకునే వాడిని. 

నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా ఏ రకంగానూ విమర్శలు చేయలేదు. నేను సపోర్ట్ చేసిన వారిని గెలిపించాలని, పొగిడాను కానీ, ఎవరినీ వ్యక్తిగతంగా మాటలు ఆనలేదు. ఈ రోజు మీముందుకు రావడానికి కారణం ఈ రోజు నుంచి నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ సపోర్టర్‌ని కాదు. ఇప్పుడు నేను జస్ట్ కామన్‌ మ్యాన్‌ని. ఇలానే నా సినిమాలు, షూటింగ్‌లు చేసుకుంటాను. ఐదేళ్లకి మీలాగానే నేను కూడా ఓటు వేసి వస్తాను. ఇక రాజకీయాలకు స్వస్తి. గుడ్‌ బై` అంటూ వీడియో విడుదల చేశాడు అలీ. 

ఇదిలా ఉంటే అలీ ఈ నిర్ణయానికి కారణాలేంటనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. అలీ ఆరాధించిన జగన్‌ వైసీపీ ఘోరంగా ఓటమి ఫాలయ్యింది. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలోని ఎన్డీయే(టీడీపీ జనసేన బీజేపీ) కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. పర్సనల్‌గా పవన్‌కి అలీ మంచి స్నేహితుడు. అంతకు ముందు పవన్‌ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ ఉండేవాడు. తమ బాండింగ్‌కి అది నిదర్శనం. అయితే అలీ పార్టీ మారిన తర్వాత వీరిద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది. పవన్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అలీ సపోర్ట్ చేయలేదు. పైగా వైసీపీలో చేరి కొన్ని రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. 

ఇప్పుడు పవన్‌ నాయకత్వంలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలోనే అలీ రాజకీయాలకు స్వస్తి అని ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే మరి ఆయన మున్ముందు జనసేనలో చేరుతాడా? మళ్లీ పవన్‌తో కలిసిపోతాడా? అలీ ప్రకటించినట్టు ఇక పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios