తెలంగాణ కేబినెట్ విస్తరణ ... వారికే మంత్రులుగా ఛాన్స్ : సీఎం రేవంత్ 

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర అప్ డేట్ ఇచ్చారు. తన కేబినెట్ లో ఎలాంటి వారికి చోటుంటుందో రేవంత్ హింట్ ఇచ్చారు. దీన్నిబట్టి ఎవరికి మంత్రిపదవులు దక్కే అవకాశాలున్నాయంటే... 

CM Revanth Reddy reacts on Telagana Cabinet Expansion AKP

న్యూడిల్లీ :  కేబినెట్ విస్తరణ... తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గంలోని సీనియర్ నాయకులంతా ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలోనే మకాం వేసారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం మరింత జోరందుకుంది. ఈ క్రమంలోనే మంత్రులుగా వీరికి అవకాశం రావచ్చంటూ కొన్నిపేర్లు ప్రచారమవుతున్నాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద హోం, విద్యా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆండ్ అర్బన్ డెవలప్‌మెంట్,  వాణిజ్య పన్నులు,జనరల్ అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖలున్నాయి. వీటికి పూర్తిస్థాయి మంత్రులను కేటాయించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ అదిష్టానం వున్నట్లు సమాచారం. అలాగే కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా హోంశాఖ ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఈ శాఖపై పట్టు కోల్పోకుండా సీఎం రేవంత్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది... అందులో భాగంగానే తన సన్నహితులకే ఈ పదవి దక్కేలా ఆయన పావులు కదుపుతున్నట్లు పొలిటికల్ టాక్. ఇదే నిజమైన ఆయనకు అత్యంత సన్నిహితురాలు సీతక్కకు ఈ పదవి దక్కవచ్చు... ఇప్పటికే ఆమె రేవంత్ కేబినెట్ లో వున్నారు కాబట్టి ప్రమోషన్ ఇచ్చి హోంమంత్రిని చేస్తారన్నది టాక్. 

మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు సైతం హోంమంత్రి పదవిపై కన్నేసారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారు కూడా హోంమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలు సైతం మంత్రివర్గంలో చోటుపై ఆశతో వున్నారు... వారిలో ఎవరికైనా ఈ హోంమంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

ఇక విద్యాశాఖపై ప్రస్తుతం వివాదం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై దృష్టి సారించడంలేదని... దీంతో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే గందరగోళం నెలకొందని ప్రత్యర్థుల విమర్శిస్తున్నారు. దీంతో విద్యాశాఖ మంత్రిని నియమించాలన్న డిమాండ్ పెరిగింది.  ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖతో పాటు సీఎం వద్దగల అన్ని శాఖలను మంత్రులకే కేటాయించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ ఆసక్తికర కామెంట్స్ : 

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ ఖాళీగా లేదు... అన్ని శాఖలకు మంత్రులు వున్నారన్నారు. హోం, విద్యా శాఖ బాధ్యతలు తాను చూసుకుంటున్నానని... ఇప్పటికయితే ఈ శాఖలకు ఫుల్ టైమ్ మంత్రిని తానేనని రేవంత్ అన్నారు. 

ఇలా మంత్రివర్గంలో ఖాళీలు లేవంటూనే విస్తరణపై ఆసక్తికర కామెంట్స్ చేసారు సీఎం రేవంత్. గతంలో కేసీఆర్ మాదిరిగా ఇతర పార్టీల నుండి చేరినవారికి మంత్రివర్గంలో పెద్దపీట వేయడంలేదని రేవంత్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కాంగ్రెస్ భీపారంపై గెలిచినవారికే మంత్రివర్గ విస్తరణలో అవకాశం వుంటుందన్నారు. దీంతో ఇతర పార్టీలనుండి చేరిన  పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటివారి పేర్లు కొత్త మంత్రుల లిస్ట్ లో లేనట్లేనని స్పష్టం అవుతోంది.
 
ఇలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు మరింత సస్పెన్స్ ఏర్పడింది. అసలు మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు వుంటుందా..? వుంటే ఎవరికి అవకాశం దక్కుతుంది..? రేవంత్ దగ్గరున్న హోం, విద్యాశాఖలు ఎవరికి దక్కుతాయి? అనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 

మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇవ్వకున్నా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పుపై మాత్రం క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. త్వరలోనే తాను టిపిసిసి అధ్యక్షుడిగా తప్పుకోనున్నానని... మరొకరికి ఆ అవకాశం దక్కుతుందన్నారు. తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడి ఎంపికపై అదిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని... త్వరలోనే ఎవరన్నది ప్రకటిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ మాటలను బట్టి వచ్చేనెల జూలైలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షమార్ఫు ఖాయంగా కనిపిస్తోంది.  అయితే టిపిసిసి బాధ్యతలు కూడా తనకు అనుకూలంగా వుండేవారికి ఇప్పించుకునే ప్రయత్నాల్లో రేవంత్ రెడ్డి వున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios