Asianet News TeluguAsianet News Telugu

చేతులు జోడించి వేడుకుంటున్నా.. అందరినీ ఒకేలా చూడకండిః అక్కీ భావోద్వేగం

బాలీవుడ్‌కి ఏమైంది అంటూ మీడియా సైతం కథనాలు షురూ చేసింది. ఇలా వరుసగా హిందీ చిత్ర పరిశ్రమపై అనేక ఆరోపణలు వస్తున్నా స్టార్స్ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. 
 

bollywood star akshay kumar react on drugs case arj
Author
Hyderabad, First Published Oct 4, 2020, 6:06 PM IST

బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. యంగ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యతో ప్రారంభమైన నెపోటిజం వివాదం. క్రమంగా అది డ్రగ్స్ వైపు తిరిగింది. ఇందులో స్టార్స్ పేర్లు బయటకు వచ్చాయి. దీపికా పదుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్లు డ్రగ్స్ కేసులో రావడంతో బాలీవుడ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. 

బాలీవుడ్‌కి ఏమైంది అంటూ మీడియా సైతం కథనాలు షురూ చేసింది. ఇలా వరుసగా హిందీ చిత్ర పరిశ్రమపై అనేక ఆరోపణలు వస్తున్నా స్టార్స్ ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇండియాలోనే టాప్‌ మోస్ట్ స్టార్స్ బాలీవుడ్‌లో ఉన్నా ఈ వివాదాలపై నోరు మెదపలేదు. దీంతో తప్పుని ఒప్పుకున్నట్టే అనే కామెంట్స్ వినిపించాయి. 

ఈ నేపథ్యంలో అక్షయ్‌ కుమార్‌ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. అక్కీ మాట్లాడుతూ, బరువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నా. నా అభిప్రాయాలను చెప్పాలని చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నా. కానీ సరైన సమయం  కాదని అనిపించింది. ఎవరికి, ఎలా, ఏం చెప్పాలో అర్థం కాక ఇన్నాళ్ళూ మౌనంగా ఉండిపోయా` అని మొదలు పెట్టారు. 

మమ్మల్ని ఇప్పటికీ స్టార్స్ అని పిలుస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు. బాలీవుడ్‌ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ప్రేక్షకులు. వారి అభిమానం వల్లే. సినీ ఇండస్ట్రీ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అదొక మాధ్యమం. దీని ద్వారా భారతీయ విలువలను, సంస్కృతిని, అలవాట్లని ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రచారం చేస్తున్నాం. ప్రజల సెంటిమెంట్లని సినిమాలు ప్రతిబింబిస్తాయి. ప్రేక్షకులంతా ఇప్పుడు కోపంగా ఉన్నారంటే, ఆ కోపాన్ని మేం కచ్చితంగా అంగీకరించాల్సిందే. 

సుశాంత్‌ మృతి తర్వాత అందరిలాగే మేమూ చాలా బాధపడ్డాం. ఏం జరుగుతుందో అర్థం కాక నిమ్మకుండిపోయాం. ముఖ్యంగా బాలీవుడ్‌ అంటే అందరూ ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బాలీవుడ్‌ అంతా క్లీన్‌గా ఉందని చెప్పలేను. అన్ని రంగాల్లో ఉన్నదే ఇక్కడ కూడా ఉంది. 

ఒక వ్యవస్థలో కొంత మంది తప్పు చేస్తే, అది అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు. డ్రగ్స్ విషయంలో విచారణలు జరుగుతున్నాయి. న్యాయ, చట్ట వ్యవస్థలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దాన్ని మేం నమ్ముతాం. గౌరవిస్తాం. సినిమా ఇండస్ట్రీలోని ప్రతి వ్యక్తి దీనిని నమ్మి, సహకరించాలని కోరుతున్నా. ఈ సందర్భంగా అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇండస్ట్రీలోని అందరినీ ఒకేలా మాత్రం చూడకండి. అందరినీ దోషులుగా భావించకండి` అని అక్షయ్‌ పేర్కొన్నారు. 

దీనికి సోషల్‌ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది. అక్షయ్‌ స్పందించడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సరైన్‌ టైమ్‌లో కరెక్ట్ గా స్పందించారని తెలిపారు. అక్కీ లాగా ఇతర స్టార్స్ ముందుకొచ్చి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios