క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మెల్లిమెల్లిగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ట్వీట్ చేశారు.   ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్ల‌ల్లో ఉండి లాక్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని కోరారు. 

ఇక కరోనా విభృంభణతో ఎదురవుతున్న సంక్షోభంలో జనసేన అధినేత, తన బాబాయి పవన్‌ కల్యాణ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించిన సాయంతో తాను కూడా స్ఫూర్తి పొంది విరాళం ఇద్దామని నిర్ణయించుకున్నానని సినీనటుడు రామ్ చరణ్‌ ప్రకటించారు. ప్రభుత్వాలు చేస్తోన్న కృషికి మద్దతుగా చిరు సాయం చేస్తున్నానని తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే క్షేమంగా ఉండాలని ఆయన కోరారు.    

'పవన్‌ కల్యాణ్ గారి ట్వీట్‌తో స్ఫూర్తి పొంది కేంద్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలీఫ్‌ ఫండ్‌కు మొత్తం కలిపి రూ.70 లక్షలు ప్రకటిస్తున్నాను. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. అందరూ నిబంధనలకు లోబడే ఉండాలని ఒక బాధ్యతగల పౌరుడిగా నేను కోరుతున్నాను'  అని ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్‌లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే 38,000 మంది ఆయనను ఫాలో అయ్యారు.