న్యూ ఇయర్‌ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి చిత్రాన్ని గీస్తూ కనిపించారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఆయనలోని మరో కోణాన్ని చాటారు. అయితే అది ఎందుకు గీశారనేది తెలియలేదు. తాజాగా ఆ సీక్రెట్‌ రివీల్‌ అయ్యింది. స్టయిలీస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కోసం బ్రహ్మీ ఈ చిత్రాన్ని గీసినట్టు తేలిపోయింది. దీన్ని బన్నీ రివీల్‌ చేశారు. తనకు బ్రహ్మీ ఇచ్చిన సర్‌ప్రైజ్‌ పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

ట్విట్టర్‌ ద్వారా అల్లు అర్జున్‌ తెలియజేస్తూ, బ్రహ్మానందం అందించిన చిత్రాన్ని పంచుకున్నారు. `బ్రహ్మానందం నుంచి అందుకున్న అమూల్యమైన గిఫ్ట్ ఇది. 45 రోజులపాటు శ్రమించి ఈ స్కెచ్‌ వేశారు. ఆయనకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు బన్నీ. కొత్త సంవత్సర కానుకగా ఈ గిఫ్ట్ ఇవ్వడంతో బన్నీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. జనరల్‌గా బ్రహ్మీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన గతంలో, లాక్‌డౌన్‌ సమయంలో హనుమంతుడిని కౌగిలించుకున్న రాముడు, ఆనంద బాష్పాలు కారుస్తున్న హనుమంతుడి వంటి బొమ్మలను స్కెచ్‌ వేశారు. 

బన్నీకి, బహ్మానందానికి మంచి అనుబంధం ఉంది. చాలా వరకు అల్లు అర్జున్‌ సినిమాల్లో బ్రహ్మీ ఉంటారు. `రేసుగుర్రం`లో బన్నీ, బ్రహ్మీ క్లైమాక్స్ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇలా `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి చిత్రాల్లో వీరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అలాగే ఇటీవల వచ్చిన `అలా వైకుంఠపురములో` చిత్రంలో కూడా బ్రహ్మీని పాటలో గెస్ట్ గా మెరిపించాడు బన్నీ.