సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ కి సంబంధించిన ఓ వ్యవహారం చాలా కాలంగా కోర్టులో నలుగుతోంది. హీరో ధనుష్ తమ కొడునే అని.. చిన్నతనంలో మందలిస్తే.. ఇంటి నుండి వెళ్లిపోయాడని మదురైకి చెందిన కదిరేషన్, మీనాక్షి దంపతులు కోర్టుని ఆశ్రయించారు.

ఈ కేసు విషయంలో ఇన్నాళ్లు నత్తనడకన వ్యవహరించిన మదురై కోర్టు ఒక్కసారిగా ధనుష్ కి షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ధనుష్ జనన, విద్య, ఇంటికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. ఇంత జరుగుతున్నా.. ధనుష్ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

వెంటనే అతడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు న్యాయస్థానంలో పొందుపరచాలని చెన్నై కార్పోరేషన్ ని ఆదేశించింది. మరోవైపు తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ.. తామెవరో తెలియదంటే భరించలేకపోతున్నామని కదిరేషన్ దంపతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే అసలు నిజం బయటపడుతుందని కోర్టుకి తెలిపారు. గతంలో ధనుష్ పుట్టుమచ్చలు చెరిపించుకున్నాడనే వ్యవహారం కూడా సంచలనంగా మారింది. అయితే తన యాక్టింగ్ ప్రొఫెషన్ లో భాగంగానే అలా చేసినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!