నిజామాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో నాయకుల మధ్య మాటల సమరం మరింత ఎక్కువయ్యింది. ముఖ్యంగా బిజెపి ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఈ మాటలయుద్దం తారా స్థాయికి చేరింది. తాజాగా నిజామాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై విరుచుకుపడ్డారు. 

కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ది పొందాలని బిజెపి పార్టీ, ఎంపీ అరవింద్ చూస్తున్నారని... వారి ఆటలు సాగనివ్వబోమని మంత్రి అన్నారు. తాము వారిలా కాదని కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూపించే ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. కాబట్టి విపక్షాల మయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని... ఎవరి వల్ల అభివృద్ధి సాధ్యమో ఆలోచించి ఓటేయాలని మంత్రి సూచించారు. 

read more  కరీంనగర్ మున్సిపోల్స్: అధికారులపై కలెక్టర్ సీరియస్... 209 మందికి షోకాజ్ నోటీసులు

కేవలం అబివృద్ది మాత్రమే కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్ధులకు ఓటేసి గెలిపించాలని... అలాకాకుండా రాష్ట్రంలో అశాంతి కావాలంటే బిజెపి, ఎంఐఎం వంటి మతతత్వ పార్టీలకు  ఓటేయాలని అన్నారు. తమను ఎలాగయినా ఓడించాలని బిజెపి, కాంగ్రెస్ లు లోపాయికారి ఒప్పందంతో ఎన్నికల బరిలో నిలిచాయని... వారి కుట్రలను ఛేదించి తప్పకుండా భారీ మెజారిటీతో టీఆర్ఎస్ ను గెలిపించుకుంటామని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులిచ్చినట్లు ఎంపీ అరవింద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం కేంద్రానికి అందించే పన్నుల నుండే తిరిగి ఇస్తున్నారని... అంతకంటే ఎక్కువగా ఒక్కరూపాయి కూడా ఇవ్వడం  లేదన్నారు. మన డబ్బులు మనకు ఇస్తూ ఏదో రాష్ట్రాన్ని ఉద్దరిస్తున్నట్లు ఎంపీ మాట్లాడటం విడ్డూరంగా వుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.