కరీంనగర్: తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ కు సర్వం సిద్దమయ్యింది. ఇలాంటి కీలక సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. అయితే ఈ శిక్షణా తరగతులను లైట్ గా తీసుకుని హాజరుకాని అధికారులపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక సీరియస్ అయ్యారు. వీరికి  షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. 

కరీంనగర్ నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యింది. అతిత్వరలో పోలింగ్ జరగాల్సి వుంది. ఈ  క్రమంలోనే ఎన్నికల విధులు నిర్వహించేందుకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు ఎన్నికల సంఘం శిక్షణ తరగతులు నిర్వహించింది. అందులో భాగంగానే మొదటి రెండు విడతల్లో పీవోలు, ఏపీవోలు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణనిచ్చారు.

read more  ఎర్రబెల్లి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి: జీవన్ రెడ్డి డిమాండ్

అయితే మొదటి విడతలో 72 మంది, రెండో విడతలో 73 మంది అధికారులు ఈ శిక్షణ తరగతులకు గైర్హాజరయ్యారు. అలాగే 95 మంది పర్యవేక్షకుల్లో 35 మంది సహాయకులు, 29 మంది ఇతర సిబ్బంది కూడా హాజరు కాలేదని శిక్షణ తరగతులను పర్యవేక్షించిన కలెక్టర్ శశాంక తెలిపారు. గైర్హాజరైన సిబ్బంది తీరుపై ఆయన ఆరా తీశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలను ఆదేశించారు. దీంతో మొత్తం 209 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.