ఆర్థిక మాంద్యం ఉన్న ప్రజా సంక్షేమానికి డోకా లేదన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ , దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉంది. .కేంద్రం నుండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది పేదల సంక్షేమ ప్రభుత్వమని వేరే అభివృద్ధి కార్యక్రమాలకు కోత ఉన్నా.. సంక్షేమానికి కోత ఉండదని హరీశ్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ , బిజెపి ప్రగల్బాలు పలుకుతున్నయని వారు బాగా పనిచేసుంటే పక్క రాష్ట్రాలు మన రాష్ట్రానికి ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ను పక్క రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని హరీశ్ రావు గుర్తుచేశారు. బీదర్ , గుల్బర్గా ప్రాంతాల ప్రజలు కూడా తమను కూడా తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నాయన్నారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిరంతరాయ విద్యుత్ వస్తోందని.. దేశంలో 24 గంటలు నిరంత విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని హరీశ్ రావు తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత రైతులకేనని.. రైతుబంధు ద్వారా ఎకరాకు 10 వేల పెట్టుబడి సాయం అందిస్తూ రైతుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత, విత్తనాల కొరత లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని హరీశ్ స్పష్టం చేశారు.

టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక మండలానికి ఒక 5వేల మెట్రిక్ టన్నుల గోదాం ఏర్పాటు చేశామని..  రైతులకు మంచి మద్దతు ధర కల్పిస్తున్నాం..తొందర పడి ఎవరు అమ్ముకొవద్దని ఆయన పిలుపునిచ్చారు.

పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో లో దాన్యం అమ్ముకుంటున్నాయని.. మన రాష్ట్ర రైతుల తర్వాతే పక్క రాష్ట్రాలవి కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 13 సబ్ స్టేషన్ లను మంజూరు చేసుకున్నామని హరీశ్ గుర్తు చేశారు.