భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా... వర్షం నీరు రోడ్డుపై నిలిచి పోకుండా ఉండేందుకు పలు చోట్లు మున్సిపల్ అధికారులు నాలాలను తెరచి ఉంచారు. కాగా... అలా తెరచి ఉండటమే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యింది. మృత్యుకుహరాలుగా నాలాలు మారిపోయాయంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

నాగోల్ లోని అమరావతి బార్ ఎదుట ఉన్న నాలాలో బుధవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు పడిపోయారు. కాగా...ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుడు పెద్ద అంబర్ పేటకు చెందిన రామకృష్ణ గా గుర్తించారు.

ఇదిలా ఉండగా... ఓయూ హాస్టల్ లోకి వర్షపు నీరు చేరిపోయింది. హాస్టల్ లోని గదులన్నీ వర్షపు నీటితో తడిచి ముద్దయ్యాయి.  ఓయూ సీ హాస్టల్ లో వర్షం నీళ్లతోనే విద్యార్థులు స్నానాలు చేయడం గమనార్హం.