ఏపీలో  అన్నదాతల నిరసనలు మెుదలయ్యాయి.  కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం రైతులు మళ్ళీ నిరసన బాట పట్టారు. ప్రభుత్వ అధికారులు విత్తనాలు సరఫరా చేయడంలో చూపిస్తున్న జాప్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అన్నదాతలలో ఆనందాన్ని నింపుతున్నాయి. అయితే సాగుకు అవసరమైన విత్తనాలు సకాలంలో అందక ఆందోళనలకు  దిగుతున్నారు. 

వ్యవసాయశాఖఅధికారులు మాత్రం రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు..కర్నూలుజిల్లా ఆలూరులో పప్పు శనగ పంటను సాగు కోసం విత్తనాలను పంపిణీ చేయాలని కర్నూలు- బళ్లారి ప్రధాన రహదారిపై  రైతులు ధర్నా కు దిగారు. వ్యవసాయశాఖ సిబ్బంది రైతుల ఆందోళనను పట్టించుకోకుండా నో స్టాక్ బోర్డు పెట్టి వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయారు. వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతుల ఆందోళన మరింత ఉదృతం అయింది.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఆలూరు సబ్ డివిజన్ పరిధిలో  దాదాపు ఒక లక్ష 20 వేలఎకరాలలో పప్పు శనగ పంటను సాగు చేస్తున్నామని అందుకు 30 వేల టన్నుల కుపైగా  విత్తనాలు అవసరమని, అయితే వ్యవసాయశాఖ అధికారులు సాగుకు సరిపడే విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదని రైతుల ఆరోపించారు.ఇప్పటివరకు కేవలం 15 వేల480 టన్నుల విత్తనాలు ఆయా మండలాలకు వచ్చాయని పోలీసులకు వివరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుడడంతో సాగుకు సిద్ధమౌతున్న  వ్యవసాయ సిబ్బంది ఇంకా సాగుకు సమయం ఉందని విత్తనాలను వ్యవసాయ కార్యాలయంలో స్టాక్ పెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు..