కర్నూల్: జిల్లాలో బిజెపి సంకల్ప యాత్ర ఘనంగా ప్రారంభమయ్యింది. స్థానిక నాయకులు, బిజెపి ఎంపీ టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర  ప్రారంభోత్సవానికి  బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ హాజరయ్యారు.

ఇవాళ ప్రారంభమైన ఈ యాత్ర ప్రతి రోజు 10 కిలోమీటర్ల చొప్పున ఈనెల 31 వరకు సాగుతుందని ఆ పార్టీ నేతలు తెలుపుతున్నారు. కర్నూలు లో మౌర్యా ఇన్ నుండి మొదలైన పాదయాత్ర పట్టణంలోని వివిధ ప్రాంతాలమీదుగా సాగింది. 

మొదట జిల్లా పరిషత్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి కన్నా, టీజీలు పూల మాల వేశారు. అనంతరం రాజవిహార్ సర్కిల్ లో వివేకానందుని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.మహాత్మాగాంధీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లి... ఆచరించేలా చేయడమే ఈ యాత్ర ముఖ్య  లక్ష్యమని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కన్నా తెలిపారు. 

ఏపీలోని 13 జిల్లాల్లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభమైందన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 31 వరకు 150 కిలోమీటర్ల పాదయాత్ర 
బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, ఇతర నేతలందరూ పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. 

మహాత్మాగాంధీ అడుగు జాడల్లో పేదరిక నిర్మూలనకు మోడీ పునరంకితమయ్యారనీ...మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్రలు జరుగుతున్నాయని కన్నా వెల్లడించారు.

 పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు: టిజి

తన వెంట ప్రతిరోజు 500 నుండి 1000 మంది వరకు పాదయాత్రలో పాల్గొంటారని రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ఊరు..వాడా జనంలోకి తీసుకెళ్తామనీ... తద్వారా ప్రజలలో ఐకమత్యం పెరిగి ప్రజలందరూ సంఘటితంగా మెలిగి సమస్యలను తీర్చుకునే సత్వర అవకాశాలు దొరుకుతాయన్నారు. ఈనెల 31 న ఆదోనిలో పాదయాత్ర ముగింపు వుంటుందని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు టీజీ వెల్లడించారు.