ఒక విషయం గురించి సరైన అవగాహన లేకపోవడం అనేది చాలాసార్లు అపోహలకు దారితీస్తుంది. డెంగ్యూ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ మధ్య కాలంలో డెంగ్యూ గురించిన అవగాహన కల్పించే విషయంలో అనేక చర్యలు తీసుకోబడ్డాయి. కానీ  కొన్ని అపోహలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీటిల్లో ఒకటేంటంటే ఒకరకమైన డెంగ్యూ వైరస్ తో మాత్రమే డెంగ్యూ వ్యాధి వస్తుందన్నది. అలాగే మరొకటి ఒకసారి డెంగ్యూ వచ్చిన వ్యక్తికి మళ్లీ రెండోసారి డెంగ్యూ రాదు అని. అయితే ఇవి అపోహలు మాత్రమే. 

DEN-1, DEN-2, DEN-3, and DEN-4 అనే నాలుగు రకాలైన వైరస్ ల వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ నాలుగు వైరస్ లను సీరోటైప్ అంటారు. అంతేకాదు ఈ వైరస్ లన్నీ ఒక్కలాగే ఉంటాయి.

ఒకరకమైన డెంగ్యూ సీరోటైప్ నుండి కోలుకున్న వ్యక్తిలో ఆ రకమైన డెంగ్యూకు సంబంధించి మాత్రమే రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే ఒకసారి డెంగ్యూ బారిన పడి కోలుకున్న వాళ్లు మూడు నెలల వరకు మిగతా మూడు సీరో టైప్స్ డెంగ్యూ ల బారిన పడకుండా ఉండగలుగుతారు. 

అయితే ఈ రక్షణ అనేది దీర్ఘకాలంగా ఉండదు. డెంగ్యూ నుండి కోలుకున్న కొంత కాలం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత మిగతా మూడు రకాల డెంగ్యూ సీరోటైప్స్ ఎప్పుడైనా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడని వారితో పోలిస్తే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడేవారిలో  డెంగ్యూ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గమనించారు. 

అందుకే డెంగ్యూ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఇంతకు ముందు ఈ  డెంగ్యూ వైరస్ బారిన పడినవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. లేకపోతే ఈ వైరస్ మళ్లీ మీకు నరకం చూపిస్తుంది. నిజమేంటంటే ఒక్క దోమ కూడా ప్రమాదకరమే. దాన్ని గనక నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.