భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్రీడకు లేదు. క్రికెటర్ల విజయాలను తమ గెలుపుగా భావిస్తూ, ఓటమి ఎదురైన సమయాల్లో వారికి మద్ధతు ప్రకటిస్తారు. కానీ కొంతమంది అభిమానం పేరుతో పిచ్చి వేషాలు వేస్తున్నారు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. కోల్‌కతా చేతిలో పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయిందని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు.

అయితే కొంతమంది వ్యక్తిగత దూషణలకు దిగుతూ... అసభ్యకర కామెంట్లు చేశారు. ధోనీ చిన్నారి కుమార్తె జీవా ధోనీపై విషం చిమ్ముతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నీచమైన కామెంట్లు చేసిన వారిపై ధోనీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. అయితే ఈ కామెంట్లతో జార్ఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. చిన్నారి జీవాకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు ఆ రాష్ట్ర పోలీసులు. 

బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్‌ కాగా, సీఎస్‌కే 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

పరుగులు తీయాల్సిన సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌ 24 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు.దీంతో వీరిద్దరి వల్లే గెలిచే మ్యాచ్‌ చేజారిపోయిందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు దిగారు.

ధోని, కేదార్‌ ఆటతీరును ఎండగడుతూ విమర్శల వర్షం కురిపించారు. ఆటతో ఏమాత్రం సంబంధం లేని ధోనీ కుమార్తె, చిన్నారి జీవాపైనా విషం చిమ్మారు. ఇక ముందు సరిగ్గా ఆడకపోతే ఆమెపై అత్యాచారం చేస్తామంటూ ధోనీకి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహీ ఫ్యాన్స్ వీళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నిజమైన అభిమానులైతే ఇలాంటి నిచమైన కామెంట్లు చేయరంటూ విరుచుకుపడ్డారు.