న్యూఢిల్లీ: దోపిడీలు, దాడులు, మోసాల నేపథ్యంలో సాయుధ రక్షణ ఉన్నా రాత్రి తొమ్మిది గంటలు దాటితే నగరాలు, పట్టణాల్లోని ఏటీఎంలలో నగదును నింపొద్దని బ్యాంకులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకే నగదును నింపాలన్న హోం శాఖ.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ గడువును  సాయంత్రం నాలుగు గంటల వరకే పరిమితం చేస్తున్నట్లు ప్రైవేట్ క్యాష్ హాండ్లింగ్ ఏజెన్సీలకు స్పష్టం చేసింది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే మార్గదర్శకాలను జారీ చేసినట్లు హోంశాఖ తెలిపింది.

కనుక పెద్ద నగరాల్లోని ఏటీఎం సెంటర్లలో రాత్రి 9దాటిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో సాయంత్రం 6గంటలు దాటిన తర్వాత డబ్బులు నింపరు. జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 4గంటలు దాటిన తర్వాత ఏటీఎంలలో నగదును చేర్చే పద్ధతికి స్వస్తి చెప్పనున్నారు. ఒక వేళ ఏటీఎంలో నగదు ఖాళీ అయినా సరే మరుసటి రోజు వరకూ ఆగాల్సిందే. 

కరెన్సీ నోట్లను కేవలం సాయుధ భద్రతతో కూడిన వాహనాల్లోనే తరలించాలని, అంతేగాక బ్యాంకుల పనిదినంలో ప్రథమార్ధంలోనే నగదును అందుకోవాలని తెలిపింది. నగదును తీసుకెళ్తున్న వ్యాన్లు, క్యాష్ వాల్ట్స్, ఏటీఎం మోసాలు, ఇతరత్రా అంతర్గత కుట్రు అభద్రతా భావాన్ని పెంచుతున్నాయన్న కేంద్రం.. నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పింది.

ప్రతి క్యాష్ వ్యాన్‌లో ఇద్దరు సాయుధ రక్షకులు ఉండాలని, ఏటీఎం అధికారులు, ప్రత్యేకంగా ఓ డ్రైవర్ తప్పనిసరని పేర్కొన్నది. డ్రైవర్ పక్కన ఓ సాయుధ గార్డు ఉండాలని, లోడింగ్, అన్‌లోడింగ్ సమయాల్లోనేగాక టీ, భోజన విరామాల్లో ఎల్లప్పుడూ క్యాష్ వ్యాన్ వెంటే మరొక సాయుధ రక్షకుడు ఉండాలని వివరించింది. మాజీ మిలిటరీ, పోలీస్ ఉద్యోగులు, అర్హత కలిగినవారికి మాత్రమే రక్షణ బాధ్యతలు అప్పగించాలని ఏజెన్సీలకు తేల్చిచెప్పింది.

ఆధార్, నివాస ధ్రువీకరణ, రుణ చరిత్ర, పోలీసుల ఆమోదం వంటి వాటిని పరిశీలించి నియమించుకోవాలన్నది. నగదును తరలించే ప్రయివేటు ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డులుగా నియమించే వ్యక్తుల విషయంలోనూ ఇక ఆచితూచి అడుగులు వేయాలి. నగదు ఉన్న ప్రతి బాక్సును ప్రత్యేక లాకర్లతో లాక్‌ చేయాలి. వాటి తాళాలు ఏటీఎం ఆఫీసర్ల వద్ద ఉండాలి. 

ప్రతీ వ్యాన్‌కు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉండాలని, చిన్నతరహా సీసీటీవీలు ఉండాలని, కనీసం ఐదు రోజుల రికార్డింగ్ బ్యాకప్ సామర్థ్యం కలిగి ఉండాలన్నది. ముందు భాగంలో, క్యాబిన్ లోపల, మొత్తం మూడు కెమెరాలు ఉండాలన్న హోం శాఖ.. రూ.5 కోట్లకు మించి నగదును రవాణా చేయరాదని కూడా ఏజెన్సీలకు తెలిపింది.

సెక్యూరిటీ అలారంలను బిగించాలని, అత్యవసర సమయాల్లో, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు నగదుకు నష్టం కలుగకుండా తగిన చర్యలను తీసుకోవాలన్నది. ఇక నగదును భద్రపరిచిన పెట్టెలకు తాళాలు పకడ్బందీగా వేయాలని, ప్రత్యేకంగా గొలుసులను కట్టాలన్నది. దేశవ్యాప్తంగా బ్యాంకింగేతర ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో 8,000కి పైగా క్యాష్ వ్యాన్లు నడుస్తున్నాయి. బ్యాంకుల తరఫున ఇవి రోజూ రూ.15,000 కోట్లకు పైగా నగదును తరలిస్తున్నాయి. కొన్ని సమయాల్లో తమ క్యాష్ వాల్ట్స్‌ల్లోనే నగదును రాత్రిళ్లు ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఉంచుకోవాల్సి వస్తున్నది.