Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ మెడిసిన్స్ కు అక్కడ ఫుల్ డిమాండ్...వాటిని కొనేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి...

తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలకు కేంద్రమైన భారత్​ నుంచి వ్యాక్సిన్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో మన దేశం నుంచి సుమారు రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు నమోదయ్యాయి.
 

Indian Medicines exports reaches to Rs.1.08 lakh crore in Nine months
Author
Hyderabad, First Published Mar 12, 2020, 11:14 AM IST

న్యూఢిల్లీ: మనదేశం నుంచి వ్యాక్సిన్లు, తుది ఔషధాలు (ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు) పెద్దఎత్తున కొనుగోలు చేయడానికి విదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. నాణ్యతపై నమ్మకం, తక్కువ ధరలో లభించడం దీనికి ప్రధాన కారణాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో అంటే ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు మనదేశం నుంచి సుమారు రూ.1.08 లక్షల కోట్ల (15,546.78 మిలియన్‌ డాలర్ల) విలువైన ఔషధ ఎగుమతులు నమోదయ్యాయి. 

2018-19లో ఇదేకాలంలో 13,943.79 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.97,600 కోట్ల) ఎగుమతులు జరిగాయి. దీంతో పోల్చితే ఈసారి 11.50 శాతం పెరిగినట్లు అవుతోంది. అమెరికా, ఆఫ్రికా, యూరప్ యూనియన్ దేశాలకు తోడు చైనా తదితర ఆసియా దేశాలు సైతం మనదేశం నుంచి ఔషధాలు అధికంగా కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ సారధ్యంలోని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ తెలిపారు. 

also read ఎస్‌బి‌ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్...మినిమం బ్యాలెన్స్ ​లేకున్నా నో ప్రాబ్లం...

ఇటీవలి కాలం వరకు మన ఔషధాలపై చైనా ఆసక్తే చూపలేదు. 2019 ఏప్రిల్‌-డిసెంబర్ మధ్య చైనాకే రూ.1400 కోట్లకు పైగా (200 మిలియన్‌ డాలర్లు) విలువైన ఔషధాలను మన ఔషధ కంపెనీలు ఎగుమతి చేశాయి.

రష్యా, నెదర్లాండ్స్‌, టాంజానియా, జర్మనీ, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు కూడా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2200 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.54 లక్షల కోట్ల) ఎగుమతులు నమోదు చేసే అవకాశం ఉంది. 

2018-19 ఎగుమతులతో పోలిస్తే 12 శాతం వృద్ధికి సమానం. రెండు నెలలుగా చైనాతో సహా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. ఔషధ  ఎగుమతులపై ఈ ప్రభావం ఉండకపోవచ్చన్నది పరిశ్రమ అంచనా వేస్తోంది.

ఎగుమతుల్లో వాటా పరంగా చూస్తే ఫార్ములేషన్లు (ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు వంటి తుది ఔషధాలు), బయోలాజికల్స్‌ అధికమైనా, వృద్ధి పరంగా వ్యాక్సిన్లు ముందు ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే వ్యాక్సిన్‌ ఎగుమతులు 24.59 శాతం పెరిగాయి. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలు వీటిని అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. 

సర్జికల్స్‌ ఎగుమతులు 13.04 శాతం పెరిగాయి. ఫార్ములేషన్లు- బయోలాజికల్స్‌ 12.96 శాతం, బల్క్‌ డ్రగ్స్‌ 5.67 శాతం అధిక ఎగుమతులు నమోదు చేశాయి. ఆయుష్‌, హెర్బల్‌ ఉత్పత్తుల విభాగంలో వృద్ధి కనిపించలేదు. చైనా అతిపెద్ద ఔషధ విపణి అయినా, మనదేశం నుంచి కొనుగోలు చేయడం తక్కువ.

కానీ 2018-19తో పోలిస్తే, చైనాకు 2019-20 మొదటి త్రైమాసికంలో 37.17%, రెండో త్రైమాసికంలో 38.86%, మూడో త్రైమాసికంలో 31.91 శాతం ఎగుమతులు పెరిగాయి. తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించడమే ప్రధాన కారణం.

భారతీయ కంపెనీలు చైనాలో సత్వర అనుమతులు సంపాదించేందుకు చైనాలోని ఔషధ నియంత్రణ సంస్థల అధికారులు, అక్కడి వాణిజ్య సంఘాలతో ఫార్మాగ్జిల్‌ సంప్రదింపులు జరపడం కలిసొచ్చింది.

also read  గుడ్ న్యూస్... తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోల్‌కు..

మన ఔషధ ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు అమెరికాకే చేరుతున్నాయి. తదుపరి స్థానాల్లో దక్షిణాఫ్రికా, రష్యా, బ్రిటన్, జర్మనీ, బ్రెజిల్‌, నైజీరియా, కెనడా, నెదర్లాండ్స్‌ ఫ్రాన్స్‌ ఉన్నాయి. బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌, మయన్మార్‌ తదితర ఆసియా దేశాలూ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి.

‘‘మనదేశం నుంచి ఔషధ ఎగుమతులపై కరోనా వైరస్‌ ప్రభావం ఇంత వరకు లేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనూ ఎగుమతులు బాగానే నమోదయ్యాయి’ అని ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ వెల్లడించారు. 

‘కరోనా వైరస్ నేపథ్యంలో ఈనెల ప్రారంభంలో కొన్ని ముఖ్యమైన ఔషధాల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. దీన్ని సమీక్షించాలని కోరాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. అందువల్ల జనవరి- మార్చి త్రైమాసికంలోనూ మా అంచనాలకు తగ్గట్లే ఎగుమతులు ఉంటాయి’ అని ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios