ప్రపంచంలో అత్యధికంగా పసిడిని వినియోగిస్తున్న భారత్‌లో క్రమంగా తన మెరుపును కోల్పోతున్నది. దేశవ్యాప్తంగా అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం దిగుమతులు ఢీలాపడుతున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్యభారత్ 29.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 5.5 శాతం పసిడి దిగుమతులు తగ్గాయి.

దీంతో కరెంట్ ఖాతా లోటును నియంత్రించడానికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది. 2017-18 ఏడాది ఇదే సమయంలో 31.2 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతైనట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గడంవల్లే దిగుమతులు తగ్గాయని ట్రేడర్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అక్టోబర్ నుంచి వరుసగా మూడు నెలలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న పసిడి దిగుమతులు...జనవరిలో ఏకంగా 38.16 శాతం ఎగబాకి 2.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ఫిబ్రవరిలో కూడా పసిడి దిగుమతులు 10.8 శాతం పెరిగి 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా పసిడి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో ఆభరణాల మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉండటంతో దిగుమతిని అత్యధికంగా చేసుకుంటున్నది. 

అయినా గత 11 నెలల్లో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు కూడా 6.3 శాతం తగ్గి 28.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం) జీడీపీలో 2.9 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇది 1.1 శాతం మాత్రమే.

కాగా, విలువ పరంగా చూస్తే 2017-18లో భారత్ 955.16 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది దిగుమతి చేసుకున్న 780.14 టన్నులతో పోలిస్తే 22.43% అధికం.

పసిడి దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా దిగుమతులకు కళ్లెం వేయడంలో విఫలం అవుతున్నది. భారత్-దక్షిణ కొరియా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే బంగారంపైనా పన్నును విధించింది.

ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నది భారత్. ఈ సుంకాన్ని తగ్గించాలని దేశీయ ఆభరణాల వర్తకులు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతున్నది.

అయినా బంగారం దిగుమతులు తగ్గలేదు. అయితే దేశీయంగా బంగారం లభ్యత పెరగడానికి, ఆభరణాల ఎగుమతులు పుంజుకోవడానికి వీలుగా దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆభరణాల పరిశ్రమ వర్గాలు కోరుతూనే ఉన్నాయి.