న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతానికి పరిమితం కావచ్చునని కేంద్ర ప్రభుత్వం  అంచనా వేసింది. ఇది గత 11 ఏళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2008-09లో దేశ జీడీపీ 3.1 శాతానికి పరిమితమైంది. మళ్లీ ఆ తర్వాత ఈసారి వృద్ధిరేటు అంచనాలే అత్యంత బలహీనంగా కనిపిస్తున్నాయి. 

కాగా, గత ఆర్థిక సంవత్సరం (2018-19) భారత వృద్ధిరేటు 6.8 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి తాజా అంచనాలు సవరించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కీలక తయారీ రంగంలో వృద్ధిరేటు గణనీయంగా పడిపోవచ్చని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) పేర్కొన్నది. 

గత ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న తయారీ రంగం పనితీరు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు శాతానికి పడిపోవచ్చని జాతీయ ఆదాయపు తొలి ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ తెలిపింది. వ్యవసాయ, నిర్మాణ, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా తదితర రంగాల్లో వృద్ధి మందగించనున్నట్లు వెల్లడించింది. 

also read యాక్సిస్ బ్యాంకుకు 15 వేల మంది రాజీనామా...కారణం... ?

గతంతో పోల్చితే నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 3.2 శాతానికి, వ్యవసాయ రంగంలో 2.9 శాతం నుంచి 2.8 శాతానికి దిగజారవచ్చని చెప్పింది. అయితే గనులు, ప్రభుత్వ పరిపాలన, రక్షణ రంగాల తీరు స్వల్పంగా మెరుగైయ్యే వీలున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో జీడీపీ గణాంకాలు ఆరేళ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. 2013 తర్వాత ఇదే కనిష్ఠం. 

అంతకుముందు త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో జీడీపీ 5 శాతంగా ఉన్నది. జీడీపీ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వరుస ద్రవ్యసమీక్షల్లో రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సైతం పలు సంస్కరణలను అమలు చేసినా ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. 

గత నెల 31తో ముగిసిన అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు వచ్చే నెల 28న విడుదల కానున్నాయి. ఇదే సమయంలో పూర్తి ఏడాది (2019-20)కిగాను సవరించిన వృద్ధి అంచనాలనూ కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించనున్నది.దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం.. వృద్ధిరేటు ఉసురు తీస్తున్న నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దడానికి రాబోయే బడ్జెట్‌లో అదనపు ఉద్దీపనలకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వ్యక్తిగత పన్ను రాయితీలు, మౌలిక రంగంపై మరిన్ని పెట్టుబడులు ఉండవచ్చని సంబంధిత ప్రభుత్వ వర్గాలు, ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

also read రూ.30 వేల కోట్ల కోసం రూ.7 లక్షల కోట్ల....

గత వారం రాబోయే ఐదేండ్లకుగాను రూ.102 లక్షల కోట్ల మౌలిక రంగ పెట్టుబడులను నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.త్వరలో మరో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులనూ ఆవిష్కరిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకుతోడు ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని పెంచుతూ ఈ బృహత్తర ప్రణాళికకు మోదీ సర్కారు రూపకల్పన చేసింది.

దేశ జీడీపీపై ప్రభుత్వ అంచనాలు ఆందోళనకరంగా ఉంటే.. మరోవైపు ప్రైవేట్‌ రంగ ఆర్థికవేత్తల అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తుండటం విశేషం. వచ్చే ఏడాది జీడీపీ 6-6.5 శాతంగా ఉండొచ్చని చెబుతున్నారు. వృద్ధిరేటుకు అనువైన పరిస్థితులు స్థిరంగా బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. 

దేశ ఆర్థిక వ్యవస్థను 2024-25నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. అయితే అడుగడుగునా ఈ లక్ష్యానికి అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. గత నెల డిసెంబర్‌లో దేశంలోని నిరుద్యోగం 7.7 శాతానికి పెరిగింది. 2018 డిసెంబర్‌లో ఇది 7 శాతంగానే ఉన్నట్లు ముంబైకి చెందిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ గణాంకాలు చెబుతున్నాయి. 

కాగా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు భారతీయ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు సైతం దేశీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలకూ దారి తీస్తున్నాయని పలు రేటింగ్‌ ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి.