న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల మేర మేలు చేసేలా కేంద్రంలోని మోడీ సర్కార్ మరో పథకాన్ని అమలులోకి తేనున్నది. ఏళ్ల తరబడి న్యాయస్థానాలు, వివిధ విచారణ సంస్థల్లో పెండింగ్‌లో ఉన్న పన్ను వివాదాలను ఎంతోకొంత చెల్లింపు చేయించుకుని మూసేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇందుకు 'సబ్‌కా విశ్వాస్‌' గానీ. 'సబ్‌కా వికాస్‌' అనే పేరుతో ఒక పథకాన్ని తేవాలని సర్కార్ వర్గాలు నిర్ణయించారని తెలుస్తోంది. వచ్చే బడ్జెట్‌లో దీనిని ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసినట్టుగా ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ఏళ్ల తరబడి వివిధ కంపెనీలకు తలనొప్పిగా మారిన పన్ను చెల్లింపు వివాదాలతో ఆయా సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని మోదీ సర్కార్ భావిస్తున్నది దీనికి తోడు ఈ తరహా వివాదాల్లో లక్షల కోట్ల మేర పన్ను ఆదాయం ఆగిపోయినందున.. వీటిని పరిష్కరించేందుకు కొత్త పథకం తేవాలని సర్కారు భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

also read ఎయిర్ ఇండియా అమ్మకానికి... కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌...

ఈ పథకంలో సర్వీస్‌ట్యాక్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్ కేసులతో పాటు వివిధ పరోక్ష పన్నుల వివాదాలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తారు.  కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న పన్ను వివాదాల పరిష్కార పథకం ద్వారా దేశంలోని కార్పొరేట్‌ సంస్థలకు దాదాపు రూ.ఏడు లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చాలన్నది మోదీ సర్కార్ ఉద్దేశంగా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు దాదాపు అయిదు లక్షల కేసుల పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో దాదాపు రూ.7-8 లక్షల కోట్ల మేర పన్ను రూపంలో ఖజానాకు రావాల్సిన ఆదాయం వివాదాల్లో నిలిచిపోయింది. ఆయా కేసులు ఏండ్ల తరబడి న్యాయస్థానాలు, క్వాసీ న్యాయ స్థానాల్లో విచారణ నిమిత్తం నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా రెవెన్యూ శాఖ ఆయా కేసులను పరిశీలించి కనిష్ట మొత్తంలో బకాయిలను చెల్లింపు చేయించుకొని ఈ వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్నారు.

పన్ను వివాదాలు సెటిల్‌మెంట్‌ చేసుకొవడమే కాకుండా కార్పొరేట్‌ సంస్థలకు తలనొప్పి దూరమవుతుందని.. దీంతో వారు ఆయా సొమ్మును పెట్టుబడుల రూపంలో దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు వీలు పడుతుందని ఈ అంశంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ గతేడాది సర్కార్‌కు ఒక నివేదికను అందజేసింది. 

దీంతోపాటు దేశంలో వ్యాపార ఏర్పాటు నిర్వహణ సులభతరమేనన్న సందేశం వ్యాపారవర్గాలకు చేరుతుందని టాస్క్‌ఫోర్స్‌ సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న పన్ను వివాదాల పరిష్కారానికి  సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) కూడా గత ఏడాది ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

సర్కార్ కొత్తగా అమలులోకి తేనున్న ఈ పథకం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు అతి తక్కువ సొమ్ము కట్టి పన్ను వివాదాల నుంచి బయటపడేలా నిబంధనల రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆర్థిక శాఖలో బలమైన కార్పొరేట్‌ లాబీయింగ్‌ జరగుతున్నట్లు సమాచారం. కొత్త పథకంలో భాగంగా మొత్తం పన్ను బకాయిలో కేవలం 10 నుంచి 20 శాతం సొమ్ము చెల్లిస్తే చాలనే విధంగా నిబంధనల రూపాకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి అదనంగా వడ్డీ సొమ్మును ఇతర అపరాధ రుసుములను కూడా చెల్లించాలనే నిబంధనలను తేనున్నట్లు సమాచారం. ఇదే కాకుండా ఆర్థిక శాఖ వద్ద మరో ప్రతిపాదన కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. లేదంటే వివాదాస్పద కేసుకు సంబంధించిన మొత్తం చెల్లింపులో 40-50 శాతం సొమ్మును తక్షణ చెల్లింపులు జరుపుకొని కేసును మూసివేసుకొనేలా మరో వెసులుబాటును కల్పించనున్నట్లు సమాచారం. 

దీని ప్రకారం సర్కార్ ఖజానాకు పన్ను వివాదాల సర్దుబాట్ల పథకం వల్ల కనిష్టంగా రూ.30వేల కోట్ల మేర సొమ్ము ఖజానాకు వస్తుందని సర్కార్ భావిస్తోంది. అసలే పన్ను ఆదాయం తగ్గి ద్రవ్యలోటు పెరిగిపోతుండడంతో సతమతమవుతున్న ప్రభుత్వం ఈ పథకం ద్వారా వీలైనంతగా సొమ్మును రాబట్టుకొని తన ద్రవ్యలోటును పూడ్చుకోవాలని చూస్తున్నట్టుగా సమాచారం.

also read ముత్తూట్‌ ఫైనాన్స్ ఎండీ కారుపై రాళ్లదాడి, తీవ్రగాయాలు

రానున్న బడ్జెట్‌లో కేంద్ర సర్కార్ పన్ను వివాదాల పరిష్కారానికి కొత్తగా అందుబాటులోకి తేనున్న పథకంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. కేంద్రంలోని బడ్జెట్‌ ఇప్పటికే కార్పొరేట్‌ పన్ను తగ్గింపు పేరుతో దాదాపు రూ.1.5 లక్షల కోట్ల మేరుకు మేలు చేకూర్చిందని వారంటున్నారు. ఇప్పుడు కొత్త పథకం వల్ల దాదాపు రూ.ఏడు లక్షల కోట్ల వరకు పన్నుల రూపంలో సర్కార్‌కు రావాల్సిన సొమ్ము రాకుండా పోతుందని వారంటున్నారు. 

కేవలం రూ.30 వేల కోట్ల నగదు కోసం.. సర్కారు ఆయా సంస్థలకు దాదాపు రూ.ఏడు లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరేలా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ల మెప్పు కోసం ద్రవ్యలోటును పూడ్చుకుని సర్కార్ చౌకగా ఇలాంటి పథకాలపై దృష్టి సారించడం ఆర్థికవేత్తలను కూడా విస్మయ పరుస్తోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల కఠినపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంగా సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఆయా సంస్థల నుంచి పన్ను వసూలు చేయడానికి బదులు ఇలా సంధి మార్గంలో కొత్త పథకాలను అందుబాటులోకి సరి కాదని వారు అంటున్నారు.

ఇలాంటి పథకాలతో స్వల్ప కాలికంగా ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగినా.. దీర్ఘకాలంలో ఖజానాకు అపారమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు కార్పొరేట్‌లతో కఠినంగా వ్యవహరించి పన్ను వివాదాలను కొలిక్కి తేవాలని.. ఈ సొమ్మును పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తే నిస్తేజంగా ఆగిపోయిన ఆర్థిక వ్యవస్థ చట్రంలో మళ్లీ కదలిక నమోదయ్యేందుకు వీలుపడుతుందని వారు సూచిస్తున్నారు.