న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమనం కొనసాగుతున్న వేళ 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ ‘ఫిచ్‌’ ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అంచనాను 4.6 శాతానికి తగ్గించివేసింది. గతంలో 5.6 శాతంగా ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది.

మరో రేటింగ్స్ సంస్థ మూడీస్ 4.9 శాతంగా అంచనా వేయగా.. ఆసియా అభివృద్ధి బ్యాంకు 5.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. భారతీయ రిజర్వు బ్యాంకు అక్టోబర్‌లో 6.1 శాతంగా అంచనా వేసినప్పటికీ, ఇటీవల 5 శాతానికి తగ్గుతుందని ప్రకటించింది. తాజాగా 'ఫిచ్‌' అంచనాలు మరింత తగ్గాయి.

also read సోనియా గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు: కేంద్ర మంత్రి

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణ లభ్యత తగ్గడం, వాణిజ్యం మరింత క్షీణించడం వంటి కారణాలతో భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించినట్లు ఫిచ్‌ వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడుదొడుకుల్లో ఉన్నా.. 2020-21 నాటికి వృద్ధిరేటు 5.6 శాతం, 2021-22 నాటికి 6.5 శాతానికి పెరుగుతుందని ఫిచ్​ ఆశాభావం వ్యక్తం చేసింది. 

అయితే భారత పరపతి రేటింగ్‌ను మాత్రం యథాతథంగా ‘బీబీబీ-’ వద్దే కొనసాగిస్తున్నట్లు ‘ఫిచ్’ పేర్కొంది. ఈ రేటింగ్‌ స్వల్పకాలిక చెల్లింపుల్లో స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం రెపో రేటు 1.35 శాతం తగ్గించిన ఆర్‌బీఐ వచ్చే ఏడాది మరో 65 బేసిస్‌ పాయింట్లు (0.65 శాతం) తగ్గించే అవకాశం ఉందని ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.


 
మరోవైపు భారత ఆర్థిక పరిస్థితిపై  ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య లోటు బడ్జెట్‌ లక్ష్యం దాటకుండా చూడాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) ద్రవ్య లోటును జీడీపీలో 3.3 శాతం దాటకుండా చూడాలని కేంద్ర బడ్జెట్‌లో లక్ష్యంగా నిర్ణయించారు. కానీ, అక్టోబరు నాటికే ప్రభుత్వం తన రుణ సేకరణ లక్ష్యాన్ని దాటేసింది.

ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో ద్రవ్య లోటు లక్ష్యాన్ని నాలుగు శాతానికి పెంచి, ఖర్చులు పెంచాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ఈ నేపథ్యంలో గోపీనాథ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఖర్చుల హేతుబద్దీకరణ, అదనపు నిధుల సమీకరణ ద్వారా ద్రవ్య లోటు జీడీపీలో 3.3 శాతం దాటకుండా కట్టడి చేయవచ్చని గోపీనాథ్‌ తెలిపారు. వృద్ధి రేటు పెంచేందుకు పెద్ద ఎత్తున కార్మిక, భూసంస్కరణలు చేపట్టాలని సూచించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అపోహలు వద్దని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశీయ పారిశ్రామికరంగాన్ని కోరారు. సొంత అనుమానాల నుంచి బయటపడి, అభివృద్ధి కోసం ఉరకలెత్తే ఉత్సాహంతో పని చేయాలని అసోచామ్‌ నిర్వహించిన ఒక సదస్సులో పిలుపునిచ్చారు. 

also read చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్ర

‘మనం ఇది చేయగలమా? భారత్‌ అది చేయగలదా? ఈ ప్రతికూల మనస్తత్వం ఎందుకు? దయచేసి ఈ సొంత శంకల నుంచి బయటకు రండి’ అని పారిశ్రామిక వేత్తలను విత్త మంతకని నిర్మలా సీతారామన్ కోరారు. ఆర్థిక వ్యవస్థను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు, బడ్జెట్‌ తర్వాత ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నదని గుర్తు చేశారు. ఆ చర్యల ప్రభావం ఇప్పటికే కొన్ని రంగాలపై కనిపిస్తోందన్నారు. వ్యవస్థను మార్చాలనే పట్టుదలతోనే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందన్నారు.
 
పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే శుక్రవారం పన్నుల విభాగ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. డేటా అనలిటిక్స్‌ టెక్నాలజీ ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, వారి పనిపట్టాలని అధికారులను కోరారు. జీఎస్టీ, ఆదాయం పన్ను (ఐటీ) విభాగాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. పాత పన్ను బకాయిల రికవరీ కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను నిర్దేశించినట్లు సమాచారం.