అమరావతి: సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్, తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ తాడేపల్లి ఎస్ హెచ్ఓకు ఫిర్యాదు చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.  తనను కొడతామని, మంగళగిరిలో ఎలా ఉంటావో చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

నాని చౌదరి టీం లోకేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనపైనా, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సరికాదంటూ హెచ్చరించారు. 
 
గత కొంతకాలంతా అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే దళిత హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితపైనా, మహిళా మంత్రులుపైనా అభ్యంతరకర పోస్టులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఆ విషయంలో కూడా తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా తనపై నాని చౌదరి టీం నారా లోకేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనపై తప్పుడుగా అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు.  

ఈసారి ఎన్నికల తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అన్నది ప్రశ్నార్థకం. నిన్ను మంగళగిరి నుంచి తరిమితరిమి కొడతాం. జగన్ ను జైలుకు పంపిస్తాం. నువ్వు ఎలా మంగళగిరిలో బతుకుతావో చూస్తాం అంటూ బూతులు తిడుతూ తనపై పోస్టులు పెట్టడం బాధాకరమన్నారు. 

అలాగే చెన్నై టీడీపీ ఫోరం కూడా తనపై ఇలాంటి వ్యాఖ్యలనే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిందంటూ దానిపైనా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై గతంలో తాను పోరాటం చేశానని ఆసమయంలో తనను చంపేస్తానంటూ కొంతమంది బెదిరిస్తూ లేఖలు రాశారని వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారని చెప్పుకొచ్చారు. 

ఈ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అయితే అతనిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను కోరారు. ఆ పోస్టులపై ఒకసారి ఆలోచించుకోవాలని లోకేష్ కు సూచించారు. టీడీపీకి చెందిన వ్యక్తి కాకపోతే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని తెలిపారు ఎమ్మెల్యే ఆర్కే. 

ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. భవిష్యత్ లో తనకు ఎలాంటి బతుకు ఇస్తారో చూస్తామని హెచ్చరించడం కాదని ఈ ఎన్నికల్లో ప్రజలు లోకేష్ ను ఓడించి ఎలాంటి బతుకు ఇచ్చారో అది గుర్తుపెట్టుకోవాలన్నారు. 

నారా లోకేష్ ఓడిపోతే తెరచాటు వెనుక ఉంటూ తనపై ఇలాంటి వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ బెదిరింపులకు పాల్పడతారా అంటూ ప్రశ్నించారు. ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని, ప్రభుత్వ పాలనను జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. 

ఇకపోతే కృష్ణనది వరదల నేపథ్యంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై మండిపడ్డారు. తాను చంద్రబాబు ఇంట్లోకి వెళ్లానంటూ తనపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిదగ్గర నిలబడ్డానే తప్ప ఇంట్లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. అయినా చంద్రబాబు ఇళ్లు అక్రమ కట్టడం అంటూ ఆరోపించారు. 

వరదలు వస్తున్నప్పుడు ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కలిగిన నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. దొంగ కట్టు కట్టుకుని చంద్రబాబు, నారా లోకేష్ లు హైదరాబాద్ పారిపోయారంటూ ధ్వజమెత్తారు. 

ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ఇలాంటి పోస్టులు పెట్టడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు ఉండాలే తప్ప ఇలాంటి దారుణమైనవిగా ఉండకూడదన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టడం సరికాదన్నారు. 

చంద్రబాబు హయాంలోనే తనను చంపేస్తానని బెదిరించారని తాజాగా కొడతామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తనకు రక్షణ కల్పించాలంటూ డీజీపీ గౌతం సవాంగ్, ఎస్ హెచ్ వోలను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు.