నిన్నటి నుండి వైసీపీ నాయకుల , మంత్రుల ట్వీట్లు చూస్తుంటే, ఒక్క విషయం మాత్రం అర్థమవుతోంది. దొనకొండలోనా మరెక్కడోకాని రియల్ ఎస్టేట్ వ్యాపారుల పంట మరోసారి పండబోతుంది అని. రాజధానిని నిజంగా మారుస్తారా లేదా తదుపరి అంశం. కానీ ఆ పేరు చెప్పుకొని ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు అమరావతిలో మరింత పడిపోగా, రెండో రాజధాని ఇదే, రాజధానిని మార్చేది ఇక్కడికే అంటూ వేర్వేరు ప్రాంతాల్లో భూముల రేట్లకు రెక్కలొచ్చేశాయి. 

నిన్నటి విజయసాయిరెడ్డి ట్వీట్ చూసినా, మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన అంశాలను గమనించినా అనుమానం మాత్రం రాక మానదు. జగన్  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అమరావతి శంకుస్థాపనకు రాలేదు. అప్పుడు కూడా టీడీపీ నాయకులు చాలామంది ఎందుకు రాలేదు? మీరు అమరావతి నిర్మాణానికి వ్యతిరేకమా అని ప్రశ్నించారు కూడా. దానికి  వైసీపీ స్పందించి, మేము అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ భూములను లాక్కున్న విధానానికి మేము వ్యతిరేకం అని చెప్పారు. ఎన్నికల సమయం వచ్చేసరికి టీడీపీ మరింత ఎదురుదాడి చేయడంతో ఏకంగా జగన్ ఒక ఇంటిని కూడా అక్కడ కొన్నాడు. 

ఇంతలోనే, ఎన్నికలు ముగియడం, జగన్ అధికారంలోకి రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి.  జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటినుంచే అమరావతిపైన జగన్ వైఖరిలో ఎమన్నా మార్పు ఉండబోతుందా అని అందరూ వెయిట్ చేశారు. కానీ ఈ ఊహాగానాలన్నిటికీ తెర దించుతూ వైసీపీ మేనిఫెస్టో రూపకర్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుంది అని తేల్చి చెప్పారు. బొత్స మునిసిపల్ శాఖా మంత్రిగా పదవి చేపట్టగానే అమరావతి పనులను సమీక్షించారు కూడా. 

ఇక్కడి వరకు కథ సాఫీగానే సాగుతుంది. కథలోని అసలు ట్విస్ట్ జగన్ సర్కార్ బుడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వచ్చింది. ఆ బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారు. అప్పుడు మొదలైన అస్పష్టత కొనసాగుతూ వస్తుంది. కనీసం రాజధాని  నిర్మాణంలో భాగస్వాములైన ప్రపంచ బ్యాంకు, ఏఐఐబి వంటి బ్యాంకులు వెనక్కి వెళ్లిపోతున్నా కూడా వైసీపీ నేతలు ఆ సంస్థలు తరలి వెళ్ళడానికి చంద్రబాబు అవినీతే కారణమంటూ ఎద్దేవా చేసారు తప్ప వారితోనే లేదా వారి ప్రతినిధులతోనో చర్చలు జరిపినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. 

ఆలా అమరావతిని మొదటినుంచి కూడా భ్రమరావతి అంటూ టీడీపీ అవినీతికి పాల్పడిందంటూ  మండిపడుతున్న వైసీపీ వైఖరిపై ఒకింత అస్పష్టత ప్రజల్లో ఎప్పటినుంచో ఉన్నా కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ స్వయంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పడంతో ప్రజలు ఓట్లు వేశారు. ప్రజలు చంద్రబాబును వ్యతిరేకించారా లేక జగన్ పట్ల విశ్వాసంతోని ఓట్లేశారా అనేది అప్రస్తుతం. కానీ టీడీపీకి కంచుకోటల్లాంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచిందంటేనే జగన్ పట్ల ప్రజల విశ్వాసం అర్థమవుతుంది. నిన్నటి వైసీపీ నేతల మాటలతో ప్రజల్లో అమరావతి పట్ల ఉన్న అస్పష్టత కాస్తా అనుమానంగా మారుతుంది. 

ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రజల స్పందనలు చూస్తుంటే వారిలో అనుమానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. వైజాగ్ స్టీల్, కియా, శ్రీ సిటీ వంటివి తప్పిస్తే చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు లేవు. పోనీ కేంద్రం ఎమన్నా సహాయం చేస్తుందా అంటే, వారే ఇక్కడ పాగా వేయాలని రాజకీయాలు నెరపడంలో బిజీగా ఉన్నారు. వారి రాజకీయం పండాలంటే, ఆంధ్ర ప్రదేశ్ కి నిధులు ఆపి వైసీపీని మరింతగా ఇరకాటంలోకి నెట్టాలి. అదే వారి ఆలోచనగా మనకు కనపడుతుంది. 

టీడీపీని ఖాళీ చేసి తామే ప్రధాన ప్రతిపక్షం అంటారా లేదా టీడీపీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ఇప్పుడైతే చెప్పలేము. కానీ ఏది ఏమైనా వైసీపీని ఇబ్బంది పెడితేనే తమకు లాభమని బీజేపీ బలంగా నమ్ముతోంది. పోనీ విభజన చట్టంలోని ప్రధాన హామీ ప్రత్యేక హోదానన్నా ఇస్తారా అంటే లేదు అని ముక్తకంఠంతో చెబుతున్నారు బీజేపీ నాయకులు. అది ఒక ముగిసిన అధ్యాయం అని వారు అనడం మనం వినడం కొత్తేమి కాదు. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఇలా బాధ్యతా రాహిత్యమైన, ఊహలకు తావిచ్చేలా మాటలు మాట్లాడితే నష్టపోయేది ప్రజలు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు వెళ్లిపోయింది. ఏఐఐబి కూడా తప్పుకుంది. రాజధాని నిర్మాణ పనులు జరగడం లేదు. ఏదైనా ఒక కొత్త సంస్థ  రావాలంటే వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ ముఖ్యంగా చూసేది విధానపరమైన కొనసాగింపు (పాలసీ కంటినుయేషన్). 

పెట్టుబడులకు పెట్టడానికి వచ్చేవారు ముఖ్యంగా చూసేది అదే. నాయకుడి చరిష్మా, రాజకీయ సుస్థిరత ప్రభావం చూపినప్పటికీ కూడా విధానాల కొనసాగింపే ముఖ్యం. ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమా జగన్ ప్రభుత్వమా అనేదానికన్నా మా పెట్టుబడులు ఇక్కడ సురక్షితమేనా? పాత విధానాలను కొత్త ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అని చూస్తారు తప్ప మరోలా కాదు. 

ఇప్పటికే పోలవరం విషయంలో పాత టెండర్లను రద్దు చేశారు. పి పి ఏలను తిరగదోడుతున్నారు.  ప్రపంచ బ్యాంకు వెళ్లిపోయింది. ఏఐఐబి కూడా తప్పుకుంది.  వీటితోనే నూతన  ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటేనే ఒకింత ఆలోచిస్తున్నారు. వీటికితోడు అమరావతిపైన కూడా అనుమానాలు ఎక్కువైతే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడుతుంది. 

సంబంధిత వార్తలు

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

వరదలు ప్రభుత్వం సృష్టించిన విపత్తు, రైతులకు అండగా ఉంటాం: చంద్రబాబు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే