ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?
రాజధాని నిర్మాణ పనులను త్వరలో చేపడతామన్న మంత్రి బొత్స సత్యనారాయణ స్వరంలో మార్పుకు కారణం ఏంటి...? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆరోపించినట్లు రాజధాని తరలిపోతుందా...? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మారబోతుందా......?గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ కొర్రి పెడుతున్న ప్రస్తుత సీఎం వైయస్ జగన్ రాజధాని విషయంలో కూడా కొర్రీ పెట్టాలని చూస్తున్నారా......? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై తీవ్ర ఆరోపణలు చేసిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఆలోచనలకు పదును పెట్టారా..? రాజధాని నిర్మాణంపై పునరాలోచనలో ఉన్నారా?
రాజధాని నిర్మాణం పనులు ఆపేయడం వెనుక మర్మం ఇదేనా....? రాజధాని తరలించేది లేదని ఓవైపు చెప్తూనే ఫ్లైఓవర్ లు, భారీ కట్టడాలు కట్టాల్సి వస్తోంది ఇక్కడ కష్టం అంటూ సాక్షాత్తు మంత్రులు ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి....?
రాజధాని నిర్మాణ పనులను త్వరలో చేపడతామన్న మంత్రి బొత్స సత్యనారాయణ స్వరంలో మార్పుకు కారణం ఏంటి...? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆరోపించినట్లు రాజధాని తరలిపోతుందా...? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల రూపకల్పనలో తన మార్కు ప్రదర్శించేందుకు తాపత్రాయపడుతున్నారు. అవినీతి రహిత పాలన అంటూ అనేక ప్రాజెక్టుల్లో కీలక మార్పులు చేస్తున్నారు.
తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా కీలక మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. కృష్ణానది వరదల సమయంలో ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అమరావతిని ముంపు ప్రాంతంగా చూపించి రాజధానిని తరలించేస్తారంటూ టీడీపీ పదేపదే ఆరోపించింది.
టీడీపీ ఆరోపణలను ప్రజలు లైట్ తీసుకున్నప్పటికీ సాక్షాత్తు రాజధాని అంశాన్ని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి సేఫ్ ప్లేస్ కాదు అంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి.
రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, దీనిపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స సంచలన వ్యాఖ్యలు చేయడంపై రాజకీయంగా రగడ మెుదలైంది. నిర్మాణ వ్యయం అమరావతిలో అయితే ఎక్కువ అవుతుందని మరోచోట అయితే తక్కువగా ఉందని, ముంపు సమస్యలు ఉన్నాయని బొత్స చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజలను ఆలోచింపచేస్తోంది.
వరదలు నుంచి రక్షణ పొందాలంటే కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సిన అవసరం ఉందని, దాంతో ప్రభుత్వంపై అదనపు భారం పడితే ప్రజాధనం వృథా అవుతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సైతం ఎన్నడూ లేని విధంగా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశారని రేపు కేంద్రం ఆరా తీస్తుంది. ప్రజలూ ప్రశ్నిస్తారు అంటూ కీలక ట్వీట్ చేశారు.
అంతేకాదు రాజధానిపై జవాబు చెప్పలేకే బాబు తన నివాసాన్ని వరదలో ముంచారనే దుష్ప్రచారం మొదలు పెట్టారు తీసేసిన తాసిల్దార్లు అంటూ సెటైర్లు వేశారు. వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులే రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజధాని తరలిపోతుందా అంటూ సందేహం నెలకొంది.
రాష్ట్ర రాజధాని అమరావతిని పర్యవేక్షించే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిల వ్యాఖ్యలు చూస్తుంటే రాజధానిపై ఏదో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రాజధానులు ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజధానిని అమరావతి నుంచి తరలించేది లేదని అయితే మరో రాజధానిని నిర్మించాలనే ప్రతిపాదనపై ఆలోచనలో వైసీపీ ఉందంటూ జోరుగా చర్చ జరుగుతోంది.
కృష్ణానది వరదల ప్రభావంతో రాజధానిలో ముంపు ప్రాంతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని రాజధాని పరిధిని కుదించే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఒకేచోట రాజధాని కీలక సంస్థలు ఉండరాదని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
ఒకరు రాయలసీమలో రాజధానిని నిర్మించాలంటే కాదు విశాఖపట్నంలో నిర్మించాలని మరోకొరు ఇలా ఎవరికి వారు వాదనలు వినిపించారు. రాయలసీమకు హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీల విభజన ఉండాలంటూ కూడా నినాదాలు చేశారు.
రాజధాని ఒకేచోట ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని వాదించారు. ఈ డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకుని వైసీపీ ఒకే రాష్ట్రం రెండు రాజధానులు దిశగా అడుగులు వేస్తోందా అన్న ప్రశ్నమెుదలవుతోంది. అయితే ఈ వార్తలపై వైసీపీ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్
అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్
అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే