గుంటూరు: కృష్ణానది వరదలు ప్రభుత్వం సృష్టించిన విపత్తు తప్ప సహజంగా వచ్చిన వరదలు కావని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణానది వరదల నేపథ్యంలో గుంటూరు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. 

భట్టిప్రోలు మండలం వెల్లటూరు నుంచి చంద్రబాబు పర్యటన చేపట్టారు. వరదలకు నీట మునిగిన పంట పొలాలను బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రకారం నీరు వదిలితే ఇబ్బంది వచ్చేది కాదన్నారు. 

వరదల ప్రభావంతో 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. వరదలు వచ్చి వారం దాటుతున్న నేటికి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్నారు. 

తన ఇల్లు అమరావతిని ముంచాలనే వైసీపీ కుట్ర పన్నిందని పదేపదే చంద్రబాబు ఆరోపించారు. దుర్మార్గపు నిర్ణయంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు  నిలదొక్కుకునే వరకు ప్రభుత్వం వారికి అండగా ఉండాల్సిందేన్నారు. రైతుల కోసం తెలుగుదేశం పార్టీ పోరాట చేస్తోందని చంద్రబాబు తెలిపారు.