మహిళ అభ్యర్ధన: రెండు సార్లు విశాఖ స్టేషన్లోనే నిలిచిపోయిన రైలు
విశాఖపట్టణంలో రెండు దఫాలు ఓ రైలు నిలిచిపోయింది. ఓ మహిళ అడగడడంతో రైలును నిలిపివేశారు. తమ వాళ్లు రైలు ఎక్కేందుకు వస్తున్నారని ఆమె రైల్వే అధికారులను వేడుకోవడంతో రైల్వే అధికారులు ఆమెకోసం రైలును కొద్దిసేపు నిలిపివేశారు.
విశాఖపట్టణం: ఓ మహిళ అడిగిందని రైలును రెండు దఫాలు నిలిపిన ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ఘటన బుధవారం నాడు ఉదయం విశాఖ జిల్లాలో జరిగింది.సికింద్రాబాద్-భువనేశవర్ ప్రత్యేక రైలు విశాఖపట్టణం స్టేషన్ నుండి బయలుదేరుతున్న సమయంలో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. రైలు బయలుదేరుతూనే ఒక్కసారిగా ఎందుకు నిలిచిపోయిందని ప్రయాణీకులు ఆరా తీశారు.
ఓ మహిళ రైల్వే గార్డు వద్దకు వెళ్లి తమ వాళ్లు రైలు ఎక్కలేదని బతిమిలాడింది. కొద్దిసేపు రైలును నిలిపివేయాలని కోరింది. ఐదు నిమిషాలపాటు రైలును నిలిపివేశారు. అయినా కూడ ఆ మహిళకు సంబంధించిన వారు రైలు వద్దకు చేరలేదు.దీంతో రైలు తిరిగి ముందుకు కదులుతోంది. అదే సమయంలో రైల్వే వంతెన నుండి తమ వాళ్లు వస్తున్నారని ఆ మహిళ మళ్లీ రైల్వే అధికారులకు చెప్పింది. రైలును కొన్ని క్షణాలు నిలపాలని కోరింది.పరుగు పరుగున ఆ మహిళ రైలు నుండి దిగి తమ వారిని రైల్లోకి తీసుకొచ్చింది. దీంతో రైలు కదిలింది. రెండుసార్లు కదిలిన రైలు ఎందుకు నిలిచిపోయిందనే విషయమై రైల్వే పోలీసులు ఆరా తీశారు.