భర్తతో గొడవలు.. ఆదుకుంటుందని సోదరిని నమ్మితే.. వ్యభిచారంలోకి

ongole prostitution scandal revealed
Highlights

భర్తతో విభేదాలు వచ్చి దూరపు బంధువు ఆదుకుంటుందని నమ్మి వెళ్ళిన అభాగ్యురాలి జీవితం వ్యభిచారానికి అంకితమైంది.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన మానవ సంబంధాలు ఎటు వైపు పోతున్నాయో చెప్పడానికి ఓ ఉదాహరణ

భర్తతో విభేదాలు వచ్చి దూరపు బంధువు ఆదుకుంటుందని నమ్మి వెళ్ళిన అభాగ్యురాలి జీవితం వ్యభిచారానికి అంకితమైంది.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన మానవ సంబంధాలు ఎటు వైపు పోతున్నాయో చెప్పడానికి ఓ ఉదాహరణ.. ఒంగోలు మండలానికి చెందిన ఓ యువతిని మద్దిపాడు మండలానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు.. అయితే కొన్నాళ్లు సవ్యంగానే సాగిన వీరి కాపురంలో కలతలు వచ్చాయి. దీంతో పుట్టింటికి వచ్చి స్థానిక కుర్చీల ఫ్యాక్టరీలో పనికి చేరింది..

ఆ సమయంలో ఆమెకు దూరపు బంధువైన రమాదేవి కనిపించడంతో తన కష్టాలు చెప్పుకుని బాధపడింది.. దీనికి స్పందించిన రమాదేవి ఒంగోలులో తన సోదరి వుందని.. చాలామంచిదని తప్పకుండా ఆదుకుంటుందని చెప్పింది.. దీంతో ఆమె వద్దకు వెళ్లింది ఆ యువతి. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో... కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఈ సమయంలో తన కుమార్తె ఒంగోలులోని వెంకటరత్నం ఆనే మహిళ వద్ద వుందని తెలిసి.. తన బిడ్డను అప్పగించమని తల్లి ఆమెను అడిగింది. అయితే తాను రూ.20 వేలకు నీ కూతుర్ని కొన్నానని.. రూ.10 వేలు ఇస్తే పంపుతానని లేదంటే లేదని తేల్చి చెప్పింది.. అయితే బాధితురాలిని ఆమె ఒంగోలులో కాకుండా తనకు పరిచయం ఉన్న శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి ద్వారా సింగరాయకొండకు చెందిన హరిబాబు అనే వ్యక్తి వద్దకు పంపింది. అక్కడ హరిబాబు బాధితురాలితో వ్యభిచారం చేయించినట్లు తెలిసింది.

బతుకు తెరువు కోసం వ్యభిచారం చేస్తే తప్పు లేదంటూ మాయమాటలు చెప్పి ఆమె సమీప బంధువు, వెంకటరత్నం, హరిబాబు తనను ఈ రొంపిలోకి దింపినట్లు బాధిత యువతి కన్నీటి పర్యంతమైంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమాదేవితో పాటు శ్రీనివాసులునాయుడు, హరిబాబు, వెంకటరత్నంలను అదుపులోకి తీసుకున్నారు.
 

loader