గుంటూరు : అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరినంత మాత్రాన తప్పించుకోలేరని జోస్యం చెప్పారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. కేసుల నుంచి తప్పించుకునేందుకే కొందరు బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన అలాంటి వారికి పార్టీ అండగా ఉండదన్నారు. 

బీజేపీలో చేరిన వారు కేసులు ఎదుర్కొంటే వాటిని వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సిందేనని వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ గత ఐదేళ్లు కేవలం రాజకీయాల కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి కోట్లాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపారని అందువల్లే అఖండ విజయం సాధించారని చెప్పుకొచ్చారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి పాలనను అందించిందని, ప్రజల సంక్షేమాన్ని మరిచి కేవలం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంలోనే మునిగిపోయిందని విమర్శించారు.  బీజేపీపైనే విమర్శలు చేసి పబ్బం గడపాలనే టీడీపీ భావించిందని దానికి మీడియా కూడా తోడై ప్రచారం చేసిందన్నారు. వారి ప్రచారాన్ని గానీ విమర్శలను గానీ ప్రజలు సమర్థించలేదన్నారు. 

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని విమర్శలతోనే పబ్బంగడిపిన టీడీపీని ఓడించారని జీవీఎల్ స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేసే నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని గుర్తు చేశారు. 

దేశంలో ఇప్పటికీ కొన్ని లక్షల కుటుంబాలకు తాగునీరు అందడం లేదని భవిష్యత్ లో 14 కోట్ల కుటుంబాలకు సాగునీటిని సరఫరా చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.  
రాజ్యసభలో సంఖ్యాబలం లేని కారణంగా కొన్ని చట్టాలను తేలేకపోయామని అయితే 2021 నాటికి పూర్తి మెజారిటీ సాధించి వాటికి కార్యరూపం దాలుస్తామన్నారు. 

2014 లో ప్రజలు పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినా రాజ్యసభలో ఏదో రకంగా అవరోధాలు కల్పించి విపక్షాలు బిల్లులను అడ్డుకున్నాయని మండిపడ్డారు. సభలో ఎక్కువగా అల్లర్లు చేసిన పార్టీలే ఎన్నికల్లో గల్లంతయ్యాయని టీడీపీపై సెటైర్లు వేశారు. 

ఏపీలో 6 నెలల నుంచి ఏడాది లోపు పూర్తిస్థాయిలో బీజేపీ బలపడుతుందని, తదుపరి ఎన్నికల్లో దక్షణాది రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జీవీఎల్ నరసింహారావు.