అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్, జూనియర్ హోదా స్థాయిల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 

సీనియర్ హోదాలో నలుగురు, జూనియర్‌ హోదాలో ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇలా మెుత్తం 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

వివరాల్లోకి వెళ్తే సీనియర్ హోదాలో హోంగార్డ్స్ అదనపు డీజీగా హరీష్ కుమార్ గుప్తా, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ ఏడీజీగా కృపానంద్ త్రిపాఠి ఉజేలా, ఎస్పీఎఫ్ డీజీగా టీఏ త్రిపాఠి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా కాంతారావులను బదిలీ చేసింది. 

మరోవైపు జూనియర్ హోదా స్థాయిలో నర్సీపట్నం ఏఎస్పీగా వై.రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్ లను బదిలీ చేసింది. రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్,  గ్రేహోండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అదనపు ఏఎస్పీ అడ్మిన్‌గా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్‌ వన్‌గా గరుడ్ సుమిత్ సునీల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.