భూకంపం: భూకంపాలు ఎందుకు వస్తాయి? రిక్టర్ స్కేలుపై తీవ్రతను ఎలా కొలుస్తారు? ఎంత తీవ్రత ఉంటే ఎంత నష్టం జరుగుతుంది? వివరంగా తెలుసుకోండి.
Myanmar Earthquake: మయన్మార్ లో భూకంపం సంభవించింది. భూప్రకంపనలు ఎక్కువగానే జరగడంతో విధ్వంసం జరిగింది. కళ్లముందే భారీ భవంతులు, వంతెనలు కుప్పకూలిపోయాయి... ప్రజలు ప్రాణభయంతో పరుగు తీసారు. ఇలా మయన్మార్ లో సంభవించిన భూకంప ప్రభావం థాయిలాండ్ లో కనిపించింది. అక్కడ కూడా భారీ భవంతులకు కుప్పకూలి ఆస్తినష్టం జరిగింది.
అయితే ఇటీవల కాలంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా భారీస్థాయిలో కాకున్నా చిన్నచిన్న భూకంపాలు వస్తూనే ఉన్నాయి. నిన్న(గురువారం) మధ్య ప్రదేశ్ లో భూకంపం వచ్చింది. అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇలా భూమి ఎందుకు కంపిస్తుంది? భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారు? భూకంప సమయంలో రక్షణ చర్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భూకంపం ఒక ప్రకృతి వైపరీత్యం. ఇది భూమి ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల వస్తుంది. ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా ఒకదానిపైపుండి ఇంకోటి జారినప్పుడు అసాధారణంగా శక్తి విడుదల అవుతుంది. దీనివల్ల భూమి లోపల చాలా మార్పులు సంభవించి కదలికలు వస్తాయి. ఇలా భూమిలో కిలోమీటర్ల లోతులో జరిగే ప్రక్రియల వల్ల భూకంపం వస్తుంది.
భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. ఈ స్కేలు భూకంప శక్తిని 0 నుంచి 10 మధ్య కొలుస్తుంది. అయితే భూమిపై 10 రిక్టర్ స్కేలు భూకంపం రావడం అసాధ్యమని భావిస్తారు.
ప్రస్తుతం భూకంపం ఎప్పుడు, ఎక్కడ వస్తుందో కచ్చితంగా చెప్పడానికి శాస్త్రీయ పద్ధతి ఏదీ లేదు. అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వంటి సంస్థలు గతంలోని గణాంకాలు, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను అంచనా వేయవచ్చు. అంటే భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడం సాధ్యంకాదు... కానీ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయో మాత్రం చెప్పవచ్చు.