చైత్ర నవరాత్రులు మొదలయ్యేలోపే అక్రమ కబేళాలను మూసేయాలని, గుళ్ల చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకూడదని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ ఏంటా రాష్ట్రం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తొమ్మిది రోజుల చైత్ర నవరాత్రులు మొదలయ్యేలోపే అక్రమ కబేళాలను మూసేయాలని, గుళ్ల చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో మాంసం అమ్మకూడదని ఆదివారం యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు మాంసం అమ్మకాలు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రకటించారు.
అక్రమంగా నడుపుతున్న కబేళాలను వెంటనే మూసేయాలని, గుళ్ల దగ్గర మాంసం అమ్మకుండా కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఉత్తరప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమృత్ అభిజాత్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆంక్షలు సరిగ్గా అమలయ్యేలా చూసేందుకు ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. 2014, 2017లో ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని దేవాలయాల దగ్గర అక్రమంగా జంతువులను చంపడం, మాంసం అమ్మడంపై కఠినంగా ఆంక్షలుంటాయని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇందులో పోలీసులు, కాలుష్య నియంత్రణ బోర్డు, పశుసంవర్ధక, రవాణా, కార్మిక, ఆరోగ్య శాఖ, ఆహార భద్రత పరిపాలన అధికారులు ఉంటారు.
రాష్ట్రంలో ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే యూపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటారు. నవరాత్రుల సమయంలో గుళ్ల దగ్గర 500 మీటర్ల పరిధిలో మాంసం, చేపల దుకాణాలు ఉండవని సమాచార, ప్రజా సంబంధాల డైరెక్టర్ శిశిర్ న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపారు. బయట ఉన్న దుకాణాలు కూడా లైసెన్స్ నిబంధనల ప్రకారమే నడుపుకోవాలి. ఎక్కడా బహిరంగంగా అమ్మకాలు జరపకూడదు. రామనవమి రోజు అన్ని దుకాణాలు మూసి ఉంటాయని చెప్పారు. నవరాత్రి, రామనవమి సమయంలో రాష్ట్రంలో 24 గంటలు కరెంటు సరఫరా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.