ORR Toll Charges Hike : కేసీఆర్ సారు... ఎందుకలా చేసారు?

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. దీంతో సామాన్యులు కేసీఆర్ సారు... ఎందుకలా చేసారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేంటి? దానివల్ల ప్రజలపై భారం ఎలా పెరిగింది? ఇక్కడ తెలుసుకుందాం.  

ORR Toll Charges Hike: Hyderabad Commuters Face Increased Travel Costs in telugu akp
KCR

ORR Toll Charges Hike : ఓవైపు హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణభారం తగ్గగా మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణభారం పెరిగింది. ఇలా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవగానే అలా హైదరాబాద్ ఓఆర్ఆర్ పై టోల్ ఛార్జీల మోత మోగింది. గత కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు ఓఆర్ఆర్ పై ప్రయాణించేవారిపై ఆర్థిక భారాన్ని మోపింది. అర్థరాత్రి నుండి ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.  

ఆరు కేటగిరీలుగా వాహనాలను విభజించి టోల్ ఛార్జీలు నిర్ణయించారు.  ఈ మేరకు పెరిగిన ఛార్జీలు వివరాలను ప్రకటించారు. కొత్త టోల్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఏ వాహనాలకు ఎంత పెంచారు? తెలుసుకుందాం.   
 

ORR Toll Charges Hike

ఓఆర్ఆర్ కొత్త టోల్ ఛార్జీలివే..

ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాధ్యతను గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ చూసుకునేది. కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2023 లో ఓఆర్ఆర్ ను ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లీజుకు ఇచ్చారు.  ఇప్పుడు ఈ సంస్థ ఓఆర్ఆర్ పై ప్రయాణించే వాహనాలపై టోల్ ఛార్జీలు పెంచింది. 

కారు, జీపు, వ్యాను వంటి వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే కిలోమీటర్ కు రూ.2.34 వసూలు చేసేవారు. దీన్ని పదిపైసలు పెంచి రూ.2.44 వసూలు చేస్తున్నారు.  ఇక మినీ బస్, ఎల్సివి వాహనాలకు కిలోమీటర్ కు 20 పైసలు పెంచారు... అంటే ఇప్పటివరకు రూ.3.77 వసూలు చేసేవారు, కానీ ఇకపై రూ.3.94 వసూలు చేయనున్నారు. 

పెద్ద బస్సులు, 2 యాక్సిల్ ట్రక్కులకు టోల్ రూ.6.69 నుండి రూ.7.00 కు పెంచారు. 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు రూ.8.63 నుండి రూ.9.01 కి టోల్ పెంచారు. భారీ నిర్మాణ యంత్రాలకు రూ.12.40 నుండి రూ.12.96 కు, భారీ వాహనాలకు రూ.15.09 నుండి రూ.15.78 కి టోల్ ఛార్జీలు పెంచారు.  
 


ORR Toll Charges Hike

ఓఆర్ఆర్ లీజుపై వివాదం : 

ఏటా ఔటర్ రింగు రోడ్డుపై రూ.400 నుండి రూ.450 కోట్ల వరకు టోల్ వసూళ్లు అవుతాయి. ఇంతటి ఆదాయం కలిగిన ఓఆర్ఆర్ ను కేవలం రూ.7,380 కోట్లకే ఏకంగా 30 ఏళ్లు లీజుకు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. అంటే 2023 వరకు హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలోని ఓఆర్ఆర్ ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లింది. ఈ లీజు వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని గతంలో టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏకంగా వెయ్యికోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసారు. 

అయితే బిఆర్ఎస్ మాత్రం ఓఆర్ఆర్ లీజు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేవని... నిబంధనల ప్రకారమే లీజు ప్రక్రియ సాగిందని అంటున్నాయి. ఇలా ఓఆర్ఆర్ విషయంలో గతంలో భారీస్థాయిలో రాజకీయ చర్చ సాగింది.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కొంతకాలం ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై విచారణ అంటూ హడావిడి సాగింది. కానీ ఇప్పటివరకు దీనిపై పురోగతి లేదు. 

ఇలా ఓఆర్ఆర్ లీజు వ్యవహారంపై వివాదం సాగుతుండగానే ఐఆర్బి సంస్థ టోల్ ఛార్జీలు పెంచింది.  ప్రతి ఏటా టోల్ ఛార్జీలు పెంచుకునే అవకాశాన్ని ఈ సంస్థకు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఏటేటా ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెరగనున్నాయి... దీంతో ఔటర్ ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేలా ఉంది.  ఇప్పటికే ప్రయాణికులు కాస్త దూరమైన, ట్రాఫిక్ సమస్య ఎదురైనా నగరంలోంచి వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారు... టోల్ ఛార్జీలు పెంచుకుంటూపోతే ఓఆర్ఆర్ ఎక్కేవారే కరువయ్యే పరిస్థితి రావచ్చు. కాబట్టి గత ప్రభుత్వ తప్పును సరిదిద్ది ఓఆర్ఆర్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని... టోల్ ఛార్జీలు పెరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. 
 

Latest Videos

vuukle one pixel image
click me!