విశాఖపట్నం: విశాఖపట్నంలోని అరకులోయలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. బాలికల తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అరకులోయ మండలం రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు సోమవారం సాయంత్రం సమీపంలోని తోటకు బయలుదేరారు. ఆ సమయంలో కారులో వచ్చిన రేగ గ్రామానికి చెందిన యువకులు అరకులోయలో జరుగుతున్న జాతరకు వెళ్దామని చెప్పి వారిని కారులో ఎక్కించుకున్నారు. 

ఆ తర్వాత రేగ గ్రామంలో ఉన్న గొల్లోరి గోపి అనే యువకుడి కోసం వెళ్లారు. అక్కడి నుంచి అరకులోయ చేరుకుని ఈ రోజు జాతర లేదని తిరుగు ప్రయాణం కట్టారు. మార్గం మధ్యలో జనంగుడ గ్రామీ సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశానికి బాలికలను తీసుకుని వెళ్లి అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

బాలికల కేకలు విని అటుగా వెళ్తున్న వారు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పారిపోయారు. బాలికల వివరాలు తెలుసుకుని సోమవారం రాత్రి గ్రామానికి తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. గోపితో పాటు నలుగురు యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలికల తండ్రులతో పాటు ప్రజా సంఘాల కార్యకర్తలు మంగళవారం అరకులోయలో ఆందోళనకు దిగారు. 

నిందితులు ఐదుగురు కూడా మేజర్లేనని, గోపి మినహా మిగిలిన నలుగురు నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.