గుంటూరు తొక్కిసలాటపై రాజకీయాలా..! అవివేకంగా మాట్లాడొద్దు: వైసిపి ఎమ్మెల్యే సంచలనం

మైలవరం : పేద ప్రజలకు సాయం అందించే ప్రయత్నంలో గుంటూరులో అనుకోని సంఘటన జరిగిందని...

First Published Jan 4, 2023, 11:30 AM IST | Last Updated Jan 4, 2023, 11:30 AM IST

మైలవరం : పేద ప్రజలకు సాయం అందించే ప్రయత్నంలో గుంటూరులో అనుకోని సంఘటన జరిగిందని... దీన్ని రాజకీయం చేయడం తగదని వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్నారైలు మూసుకుని వుండాలని అనడం... వారిని తప్పుబట్టి వేలెత్తి చూపిస్తూ ఇకపై వాళ్లు చేసే సాయాలను ఆపాలనుకోవడం అవివేకమన్నారు.  ప్రవాసీలు దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంతో చేస్తున్నారని అన్నారు. కాబట్టి గుంటూరులో దురద‌ృష్టవశాత్తు జరిగిన తొక్కిసలాటపై పలువలు చలువలు చేసి చూడటం సరికాదని వసంత కృష్ణప్రసాద్ సూచించారు.  ఉయ్యూరు పౌండేషన్ ద్వారా సొంత రాష్ట్రానికి సేవచేస్తున్న ఎన్నారై శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని మైలవరం ఎమ్మెల్యే తెలిపారు. ఆయన పుట్టినగడ్డకు సేవ చేయబోయి ఇలా కష్టాలు పడుతున్నారని అన్నారు. రాజకీయ వేదికపైకి వచ్చారనే ఉద్దేశంతోనే శ్రీనివాస్‍పై పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గతంలో ప్రతి రాజకీయ నాయకుడు చీరలు, దుస్తులు పంపిణీ చేసారు... కానీ గుంటూరులో పెద్దఎత్తున చేయాలనుకోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. పేదలకు సేవ చేయాలని ఉయ్యూరు తాపత్రయపడుతుంటాడు... తాజాగా రాజకీయ నాయకుల చేతిమీద ఆ పని చేయాలనుకోవడంతోనే వివాదం జరగుతోందని అన్నారు. జరిగిన ఒక్క సంఘటనను రాజకీయ కోణంలో చూస్తూ పెద్దది చేయడం సరికాదు... దీని వల్ల రాష్ట్రానికి మంచి చేయాలనుకునే  ప్రవాసీలు ఇబ్బంది పడే అవకాశాలుంటాయన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమే అయినా వీటినుండి పాఠాలు నేర్చుకుని తగు చర్యలు తీసుకోవాలని వసంత కృష్ణప్రసాద్ అన్నారు.