యువతకు ఐటీ, ప్రొఫెషనల్ కోర్సులు వైఎస్ చలవే: సాకే శైలజానాథ్ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 11, 2025, 2:00 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో యవతను, విద్యార్ధులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే ఈ నెల 12వ తేదీన వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'యువత పోరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ తెలిపారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు కల్పన లేదు, నిరుద్యోగభృతి అమలు అంతకంటే లేదు, చివరికి విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంకు కూడా తూట్లు పొడిచే దుర్మార్గ పాలనను చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం వ్యాపార ధోరణితోనే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఐటీ, వృత్తి నిపుణులుగా యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం చలవేనని చెప్పారు.