Vallabhaneni Vamsi Arrest: గన్నవరం నరకాసురుడు వంశీ: TDP వర్ల రామయ్య | Asianet News Telugu
నాడు అరాచకానికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు కేరాఫ్ గా మారిన గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును నరకాసురుని వధగా భావించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా రెచ్చిపోయి పేదలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు ప్రజలపై దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయన్నారు. ఆ కోవలోనే అరాచకాలకు పాల్పడి అధికారం పోయిన వెంటనే చేసిన పాపాలకు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో కలుగులోకి వెళ్లి దాక్కున్న గన్నవరం మాజి ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులో హైదరాబాద్ లో అరెస్ట్ చేశారని తెలిపారు. అరాచక పాలకులు, అరాచకానికి పాల్పడిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా.. ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. విజయవాడలో ఉన్న మరో ఆరాచక శక్తి.. వంశీని అమయాకుడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వంశీ ఒక అర్గనైజ్డ్ క్రిమినల్ అని గన్నవరం ప్రాంత ప్రజలే ఆరోపిస్తున్నారని... మూడో కంటికి తెలియకుండా హత్యలు చేయించగలడని అనుకుంటున్నారన్నారు. "నేరం చేయడంలో ఇంత ఘనాపాటి అయిన వంశీని అరెస్ట్ చేస్తే వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ కార్యాలయాన్ని తగలపెట్టి .. టీడీపీ నేతలపై దాడులు చేసి తిరిగి టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టించిన వ్యక్తి వల్లభనేని వంశీ. చివరకు మహిళలను కూడా 50 రోజులు జైలుకు పంపిన సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ వంశీ. ఇలాంటి అరాచక ఆర్గనైజ్డ్ క్రిమినల్ పై సెక్షన్ 111 క్రింద కూడా కేసు పెట్టాలి. పట్టిసీమ మట్టిని అప్పనంగా కొట్టేసిన పెద్ద దోపిడీదారుడు. దొంగపట్టాల పంపిణీ చేసిన చీటర్, బాపులపాడులో హత్యాయత్నంతో పాటు ఎన్నో అక్రమాలకు వంశీ కేరాఫ్ గా ఉన్నాడు. ఈ దుర్మార్గాలపై ప్రశ్నించిన మా నేతలపై నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. కంసుడిలా మా పార్టీ నుండి వెళ్లి మా పార్టీపైనే విషం చిమ్మాడు. అక్రమాలు, దోపిడీలతో లెక్కలేనంత ఆస్తులను పోగేసుకుని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేశాడు. ఆలస్యమైనా చట్టం ముందు దోషికి శిక్ష పడాల్సిందే. ఇటువంటి అరాచక శక్తులు గన్నవరంతో పాటు విజయవాడ, గుడివాడ, బందర్ మరియు మాచర్ల, విజయనగరం, పులివెందుల, రాజంపేటల్లో కూడా ఉన్నారు. వంశీతో పాటు వారికి కూడా చిప్పకూడు తప్పదు" అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.