వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు.. ఫిక్స్ అయిపోండి: Pawan Kalyan on Opposition status of YSRCP
వైసీపీకి ప్రతిపక్ష హోదా అనేది ఈ అయిదేళ్లలో రాదని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబో, తానో కావాలని చేసింది కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని అన్నారు. దీన్ని ఆ పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని స్పష్టంచేశారు. "భారతదేశ ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కడానికి కావల్సినన్ని సీట్లను వైసీపీ గెలవలేకపోయింది. ఆ విషయం తెలిసినా కావాలనే వైసీపీ నాయకులు విలువైన శాసనసభా సమయం వృథా చేస్తున్నారు. సీట్ల శాతం ప్రకారమే భారతదేశంలో నిబంధనలుంటాయి. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ పార్టీ నాయకులు జర్మనీ వెళ్లిపోతే బాగుంటుందని సూచించారు. ఇటీవలే జర్మనీలో ఎన్నికలు నిర్వహించారు.. అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటారని, ఇక్కడ సీట్లు ప్రాతిపదికగా ఉంటుందని వైసీపీవాళ్లు గ్రహించాలని" పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలసి మీడియాతో మాట్లాడారు. "రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన కంటే ఒక సీటు అధికంగా తెచ్చుకొని ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా అడగకుండానే వచ్చేది. కానీ వారికి ప్రజలు కేవలం 11 సీట్లను మాత్రమే ఇచ్చారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. దీన్ని వైసీపీ నాయకులు అర్ధం చేసుకోవాలి. అంతేకాని రాని ప్రతిపక్ష హోదా కోసం విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేయడం తగదు" అని హితవు పలికారు.