Asianet News TeluguAsianet News Telugu

తన పాటతో భారతీయులను జాతీయోద్యమం వైపు నడిపిన కవి ప్రదీప్

ప్రతి పోరాటంలో సాంస్కృతిక రంగానిది ప్రత్యేక పాత్ర ఉండి తీరుతుంది. అది జానపదాలు, నాటకాలు, పాటలు..

ప్రతి పోరాటంలో సాంస్కృతిక రంగానిది ప్రత్యేక పాత్ర ఉండి తీరుతుంది. అది జానపదాలు, నాటకాలు, పాటలు.. మరే రూపమైనా ఉండొచ్చు. సినిమా కూడా ఒక సాంస్కృతిక రూపమే. కానీ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఇతర సాంస్కృతి కళా రూపాల తరహాలో సినిమా పెద్దగా ప్రభావం వేయలేదు. కానీ, జాతీయ వాదాన్ని ప్రజల్లో రగిల్చిన పాట రచయితలు, సంగీత దర్శకులు బ్రిటీషర్ల ఆగ్రహానికి లోను కాక తప్పలేదు. కొందరు అరెస్టు వారెంట్లనూ ఎదుర్కొన్నారు. అందులో లిరిసిస్ట్ కవి ప్రదీప్, మ్యూజిక్ కంపోజర్ అనిల్ బిశ్వాస్‌లు ఉన్నారు.అది 1943. దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెనల ఎగసిపడుతున్న కాలం. అదే సమయంలో జ్ఞాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన కిస్మత్ సినిమా విడుదలైంది. అశోక్ కుమార్ హీరో. ఇందులో ఓ గ్రూప్ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయింది. అప్పటికే జాతీయవాద భావాలు నింపుకున్న వారిలో ఈ పాట మరింత ఉప్పొంగే ఆవేశాన్ని ఒంపింది. ‘హిందూస్తాన్ మాది.. విదేశీయులారా దూరంగా వెళ్లండి’ అనే అర్థంలో వచ్చిన పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క్విట్ ఇండియా ఉద్యమ సందేశం కూడా ఇంచు మించు ఇదే. దీంతో దేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమానికి ఈ పాట ఓ నినాదంగా మారిపోయింది. దీంతో బ్రిటీష్ అధికారులు గీత రచయిత ప్రదీప్‌కు, కంపోజర్ బిశ్వాస్‌లకు అరెస్టు వారెంట్ జారీ చేశారు.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో జన్మించిన కవి ప్రదీప్ అసలు పేరు పండిత్ రామచంద్ర నారాయణ్‌జీ ద్వివేది. క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు 1940లో విడుదలైన బంధన్ సినిమాలోనూ ప్రదీప్ రాసిన చల్ రే నౌజవాన్ అనే పాట కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో దేశభక్తిని ప్రవహింపజేసింది.కేవలం స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాదు.. మన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత కూడా ఆయన పాటలు ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించాయి. అందులో ‘యే మేరా వతన్ కా లోగోన్’ అనే పాట ఒకటి. 1962లో ఇండియా చైనాల మధ్య జరిగిన యుద్ధంలో అసువులు బాసిన జవానుల భార్యల కోసం ఫండ్ సేకరించడానికి ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ పాటను లతా మంగేష్కర్ పాడారు. ఈ పాట ఎంతో మందిని కదిలించింది. అదే కార్యక్రమానికి హాజరైన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకూ కంటతడి పెట్టించింది. అదే కార్యక్రమంలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాక్రిష్ణన్ కూడా హాజరయ్యారు.ఐదు దశాబ్దాల తన కెరీర్‌లో ప్రదీప్ సుమారు 1700 పాటలు రాశారు. ఆయనకు సినీ పరిశ్రమలోనే అత్యున్నత అవార్డుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 1997లో అందజేశారు. ఆ తర్వాతి సంవత్సరమే ఆయన తన 83వ పడిలో తుది శ్వాస విడిచారు.

Video Top Stories