
జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు
పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. చిత్రాడ దగ్గరి సభా స్థలిని పరిశీలించారు. సభకు తరలి వచ్చే లక్షలాది కార్యకర్తలు, అభిమానులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపులు, నిర్దేశిత పార్కింగ్ స్థలానికి వాహనాలు తేలికగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ చేస్తున్న ఏర్పాట్లను అధికారులకి తెలియచేశారు. అనంతరం ప్రధాన వేదిక, డీ జోన్, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వీఐపీ గ్యాలరీలను పరిశీలించారు. సభా ప్రాంగణంలోనూ, హైవే వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటు పై చర్చించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసనసభ్యులు పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.